LOADING...
Israel: సోషల్ మీడియాలో తప్పుడు మ్యాప్ పోస్ట్ చేసిన ఐడీఎఫ్.. భారతీయుల ఆగ్రహం.. క్షమాపణ చెప్పిన ఇజాయెల్ సైన్యం
సోషల్ మీడియాలో తప్పుడు మ్యాప్ పోస్ట్ చేసిన ఐడీఎఫ్.. భారతీయుల ఆగ్రహం.. క్షమాపణ చెప్పిన ఇజాయెల్ సైన్యం

Israel: సోషల్ మీడియాలో తప్పుడు మ్యాప్ పోస్ట్ చేసిన ఐడీఎఫ్.. భారతీయుల ఆగ్రహం.. క్షమాపణ చెప్పిన ఇజాయెల్ సైన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) నిన్న సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ క్షిపణుల వ్యాప్తిని చూపిస్తూ రూపొందించిన ఆ మ్యాప్‌లో, జమ్ముకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడం భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో భారత నెటిజన్ల నుండి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తగా, అనంతరం ఐడీఎఫ్ స్పందించి వివరణ ఇచ్చింది, క్షమాపణలు కూడా తెలిపింది.

వివరాలు 

విమర్శలతో దిగొచ్చిన ఇజాయెల్ సైన్యం

వివరాల్లోకి వెళితే,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల మరింత ముదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో,ఇరాన్‌లోని అణు,సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన సందర్భంలో,ఐడీఎఫ్ ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరించేందుకు ఒక మ్యాప్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఆ మ్యాప్‌లో భారతదేశానికి చెందిన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా గుర్తించడం తీవ్ర చర్చలకు దారి తీసింది. ఈ తప్పును భారతీయ నెటిజన్లు తక్షణమే గుర్తించి,తీవ్రంగా స్పందించారు. భారతదేశ భౌగోళిక సమగ్రతను తక్కువ చేసి చూపడమేనని, ఇది దౌత్యపరంగా అగౌరవపరిచిందని అభిప్రాయపడ్డారు. "ఇలాంటి వ్యవహారాల వల్లే భారత్ ఎప్పుడూ తటస్థంగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటోంది", "ఇజ్రాయెల్ నిజమైన మిత్రుడేనా?" వంటి సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.

వివరాలు 

ఇజ్రాయెల్ ఇలాంటి తప్పు చేయడం ఇది రెండోసారి 

ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ అధికారిక విభాగాల నుంచి ఇలాంటి మ్యాప్ తప్పిదం రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడానికి ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా కారణమయ్యాయి. ఇరాన్ నుంచి తమకు భద్రతాపరమైన ముప్పు ఉందని ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను సమర్థించుకుంటున్న వేళ ,భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ సంభాషణలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి,స్థిరత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ స్పష్టంగా వెల్లడించినట్టు సమాచారం. ఇలాంటి కీలక సమయాల్లో ఇజ్రాయెల్ విడుదల చేసిన తప్పు మ్యాప్ వ్యవహారం, భారత్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించదగినదే.

వివరాలు 

స్పందించిన ఐడీఎఫ్ - క్షమాపణ 

ఈ వివాదం పెద్దస్థాయిలో చర్చకు దారితీయడంతో, ఐడీఎఫ్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. వారు పంచిన మ్యాప్ కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని పేర్కొంటూ, "ఈ చిత్రం ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దులను ప్రతిబింబించడంలో విఫలమైంది. ఈ చిత్రాన్ని చూసి ఎవరికైనా మనస్తాపం కలిగితే మేము నిజంగా మన్నించమంటాం" అంటూ క్షమాపణలు తెలియజేశారు.