US-Israel: అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్.. ఆసక్తిరేపుతున్న హలేవి టూర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఈరోజు నుండి మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన భారీ చర్చకు దారి తీసింది. మార్చి 6న హలేవి తన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
వ్యూహాత్మక కార్యాచరణ దాగి ఉందని భావించబడుతోంది. అమెరికా సీనియర్ కమాండర్లతో హలేవి కీలకమైన అంశాలపై చర్చించనున్నారు.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
ఈనెల 15న, మధ్యాహ్నం 12 గంటల లోపున ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీచేశారు.
కానీ హమాస్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. శనివారం కేవలం ముగ్గురు బందీలను మాత్రమే విడుదల చేసింది.
వివరాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
అయితే గాజా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు, పాలస్తీనియన్లు గాజా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం ఇజ్రాయెల్ పర్యటించారు.
ఈ సందర్బంగా, హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
అదే విధంగా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్‌తో యుద్ధం తప్పదని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికా, ఇజ్రాయెల్ వరుస ప్రకటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక తాజాగా, ఇజ్రాయెల్ సైన్యాధిపతి హలేవి అమెరికా పర్యటనను ప్రారంభించడం పరిస్థితిని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తోంది.
రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.