
Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు వారి జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ జైలులో 'ఏకాంత గదులు' ఏర్పాటు చేశారు.
ఖైదీలు తమ భాగస్వాములతో ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం గత సంవత్సరం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ ఏడాది శుక్రవారం నుంచి సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని ఓ జైలులో ఈ ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు.
ఖైదీల హక్కుల కోసం పోరాడే కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
అయితే, ఖైదీలు ఈ గదులను వాడుకునే సమయంలో వారి వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
వివరాలు
ఈ దేశాల జైళ్లలో ఖైదీలకు ప్రైవేట్ గదులు
ఇటలీలోని కన్స్టిట్యూషనల్ కోర్టు 2024 జనవరిలో ఇచ్చిన తీర్పులో ఖైదీలకు తమ జీవిత భాగస్వాములు లేదా దీర్ఘకాలిక సహజీవన భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.
అలాంటి సమయంలో జైలు సిబ్బంది అక్కడ ఉండకూడదని కోర్టు చెప్పింది.
ఈ తీర్పును అనుసరించి అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇటువంటి ఏకాంత గదుల సదుపాయం ఇప్పటికే ఐరోపాలోని అనేక దేశాల్లో అమలులో ఉంది.
ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాల్లోని కొన్ని జైళ్లలో ఖైదీలకు ప్రైవేట్ గదులు కల్పిస్తున్నారు.
వివరాలు
ఇటలీలో 62,000 మంది ఖైదీలు
ఇటలీ,యూరప్‌లో అత్యంత కిక్కిరిసిన జైళ్లను కలిగి ఉన్నదేశంగా నిలుస్తోంది.
అధికారిక గణాంకాల ప్రకారం,ఇటలీలో ప్రస్తుతం సుమారు 62,000 మంది ఖైదీలు వివిధ నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే,ఈ సంఖ్య జైళ్ల సామర్థ్యాన్ని 21శాతం మించిపోయింది.ఈ నేపథ్యంలో,ఖైదీల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇటీవల ఖైదీల మధ్య ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది.మానసికంగా స్థిరంగా లేక కొన్ని సందర్భాల్లో ఖైదీలు బలవన్మరణానికి పాల్పడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈసమస్యల పరిష్కారానికి అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు.
ఖైదీలకు కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు.
తాజా చర్యగా,ఇప్పుడు వారి భాగస్వాములతో ఏకాంతంగా గడిపే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
ఇది ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా తీసుకున్న ముందడుగుగా భావిస్తున్నారు.