Page Loader
Earthquake: భూమిని వణికిస్తున్న ప్రకంపనలు..రెండు వారాల్లో 900 సార్లు భూకంపాలు!
భూమిని వణికిస్తున్న ప్రకంపనలు..రెండు వారాల్లో 900 సార్లు భూకంపాలు!

Earthquake: భూమిని వణికిస్తున్న ప్రకంపనలు..రెండు వారాల్లో 900 సార్లు భూకంపాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గంటకు మూడుసార్లు కన్నాఎక్కువగా భూమి కంపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు నిరంతర ఆందోళనతో జీవించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి జపాన్ టొకార దీవుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.జూన్ 21నుంచి అక్కడ భూ ఫలకాల కదలికలు చాలా వేగంగా,నిరంతరంగా జరుగుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బుధవారం రోజున అక్కడ 5.5తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. మొదట్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినా,ఆతర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అత్యవసర పరిస్థితులకోసం ప్రజలను తక్షణమే అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. జపాన్ వాతావరణ శాఖ ఏజెన్సీలో అధికారి అయిన అయాటకా ఎబిటా ప్రకారం,బుధవారం సాయంత్రం నాలుగుగంటల వరకు గత రెండు వారాల వ్యవధిలో మొత్తం 900 భూకంపాలు నమోదయ్యాయి.

వివరాలు 

జూన్ 23న ఒక్క రోజే 183 సార్లు కంపించిన భూమి

ఇతర ప్రాంతాలతో పోలిస్తే టొకార దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంది. అయినప్పటికీ, అక్కడ నివసించే ప్రజలను తక్షణమే ఖాళీ చేయించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అయితే, తరచూ వచ్చే ప్రకంపనలతో స్థానికులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారని ఓ గ్రామాధికారి వెల్లడించారు. ముఖ్యంగా జూన్ 23న ఒక్క రోజే 183 సార్లు భూమి కంపించిందని తెలిపారు. "మాకు ఎప్పుడూ భూమి కదిలేలా అనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ఏదైనా ఘోరమైన ప్రమాదం జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది" అని ఓ బాధితుడు స్థానిక మీడియాతో తన ఆవేదనను వెల్లడించాడు.

వివరాలు 

ఈ దీవుల్లో 346 సార్లు భూమి కంపించింది

గత ఏడాది కూడా ఈ దీవుల్లో 346 సార్లు భూమి కంపించింది. టొకార ప్రాంతంలో మొత్తం 12 దీవులు ఉండగా, అందులో ఏడింటిలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. ఈ దీవుల్లో నివసించే జనాభా సుమారుగా 700 మంది. భూకంపాలు తరచుగా సంభవించే ప్రదేశాల్లో జపాన్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ భూ ప్రాంతం కీలక భూ ఫలకాల మీద ఉంది. సంవత్సరానికి సగటున 1500 భూకంపాలు అక్కడ నమోదవుతుంటాయి. ఈ వారం జపాన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. దేశం త్వరలో భారీ భూకంపాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.