Page Loader
Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్‌ రక్షణ కోసం భారీ సాయం
జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్‌ రక్షణ కోసం భారీ సాయం

Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. తైవాన్‌ రక్షణ కోసం భారీ సాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్‌కు భారీ రక్షణ సాయం అందించడానికి ఆమోదం తెలిపారు. చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో, 571.3 మిలియన్ డాలర్ల రక్షణ ఆర్థిక సాయం, 265 మిలియన్ డాలర్ల విలువైన మిలటరీ ఆయుధాల విక్రయానికి బైడెన్ ప్రభుత్వం అంగీకరించింది. తైవాన్‌ రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. తైవాన్‌ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె అమెరికాలో పర్యటించడంతో చైనా మరింత ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో తైవాన్‌ చుట్టుపక్కల చైనా సైనిక మోహరింపులు పెరిగాయి. తైవాన్‌ ప్రజాస్వామ్యబద్ధ పాలనను కొనసాగిస్తోంది. తైవాన్‌ను భౌగోళికంగా, రాజకీయంగా ఒంటరిని చేయడానికి చైనా ఎలాంటి చర్యలకైనా సిద్ధమైందని అమెరికా భావిస్తోంది.

Details

యుద్ధ సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం

తైవాన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, మిలటరీ శిక్షణ, యుద్ధ సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం అందించడానికి అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. తైవాన్‌ రక్షణ మంత్రి అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రక్షణ సాయం తమ భద్రతా వ్యవస్థలను పటిష్ఠంగా మార్చేందుకు దోహదపడుతుందని చెప్పారు. అమెరికా సాయంతో తమ కమాండ్‌ అండ్ కంట్రోల్ వ్యవస్థలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. గ్రే జోన్ ప్రదేశాల్లో చైనా దూకుడును తట్టుకోడానికి తైవాన్ తమ సామర్థ్యాలను పెంచుకుంటుందని వెల్లడించింది. 76 ఎంఎం ఆటోకెనన్ పరికరాలు వంటి ఆధునిక ఆయుధాలను అందుకోవడం తైవాన్ రక్షణ వ్యవస్థకు కీలక మలుపుగా మారనుంది.