Kamala Harris: ఇజ్రాయెల్-గాజాలో యుద్దానికి ముగింపు పలకాలి: కమలా హారిస్
గత ఏడాది మొదలైన,ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ముగింపు ఇవ్వాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం మీద తిరిగి ఆక్రమణ చేయకుండా ఉండాలని ఆమె సూచించారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడులు చెయ్యడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు 41,252 మంది మరణించగా, 95,497 మంది క్షతగాత్రులయ్యారు.
అమెరికాలో ఆర్థిక వ్యవస్థ,ఆర్థిక శ్రేయస్సు ప్రజలను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలు : హారిస్
ఈ సందర్భంగా ఫిలడెల్ఫియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కమలా హారిస్ మాట్లాడుతూ, "ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ జరగాలి. ఇరాన్ శక్తిని నియంత్రించడంతో పాటు పశ్చిమాసియా స్థిరత్వాన్ని కాపాడాలి,ఇది ఆ ప్రాంత ప్రజలందరికీ ప్రయోజనకరం,"అని వ్యాఖ్యానించారు. వలసదారులపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. వాటిని ద్వేషపూరిత వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక వ్యవస్థ,ఆర్థిక శ్రేయస్సు ప్రజలను ప్రభావితం చేస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటిగా హారిస్ వ్యాఖ్యానించారు. అంతేకాక,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సందర్భంగా,కమలా హారిస్ ఆయనకి ఫోన్ చేసి పరామర్శించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ప్రమాదం నుంచి ట్రంప్ క్షేమంగా బయటపడ్డారని తెలుసుకుని,హారిస్ సంతోషం వ్యక్తం చేసినట్లు ప్రకటించారు.