
USA-China: 145% టారిఫ్‌ల మధ్య చర్చలు.. చైనాతో ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్?
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా, ఆసియా దిగ్గజం చైనా మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా ముదురుతోంది. పరస్పర సుంకాల విధానం, దూకుడు చర్యల మధ్య రెండు దేశాల ఆర్థిక సంబంధాలు తారాస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో అమెరికా ఖజానా కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర బెదిరింపుల మధ్య కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. బెసెంట్ వ్యాఖ్యల ప్రకారం, అమెరికా-చైనా ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఎలాంటి స్పష్టమైన కారణాలు లేవు.
దీంతో చైనాతో పెద్ద స్థాయిలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
Details
ప్రపంచంలోనే అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్
అయితే ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో చర్చలు కాస్త క్లిష్టంగా ఉంటాయని అన్నారు. చైనా తమ దేశానికి అతిపెద్ద ఆర్థిక పోటీదని, సైనికంగా కూడా ప్రధాన ప్రత్యర్థి అని స్పష్టంగా చెప్పారు.
వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అమెరికా చైనా వస్తువులపై ఏకంగా 145 శాతం సుంకాలు విధించింది.
దీని ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో స్పందిస్తూ అమెరికా దిగుమతులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది.
ఈ చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ ఎంత దూరం వెళ్లనుందన్న ఆందోళన కొనసాగుతోంది.
ఈ వాణిజ్య సంక్షోభంలో 'ట్రంప్ టారిఫ్‌లు' కీలక భూమిక పోషిస్తున్నాయి.
Details
90 రోజులు విరామం
చైనా సవాల్‌తో అమెరికాలో చైనా దిగుమతి వస్తువుల ధరలు ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే భారీగా పెరగనున్నాయి.
అయితే సుంకాల నుంచి ఇతర దేశాలకు తాత్కాలికంగా 90 రోజుల విరామం ఇచ్చినప్పటికీ, చైనాకు మాత్రం ఎలాంటి రాయితీ ఉండదని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు.
చైనా తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు చైనా కూడా ట్రంప్ విధించిన టారిఫ్‌లకు ప్రతీకారంగా చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా రక్షణ, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు కీలకమైన అరుదైన ఖనిజాలపై దృష్టిసారించింది.
వీటిలో 90 శాతం ఉత్పత్తి చైనా నుంచే వస్తోంది. ఈ ఖనిజాలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి నియంత్రణ జాబితాలో చేర్చింది. అంతేకాకుండా అయస్కాంతాల ఎగుమతిని కూడా నిలిపివేసింది.
Details
లోహాలు అధిక భాగం చైనాలోనే
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, అమెరికాకు అరుదైన లోహాల ఉత్పత్తి చేసే గని ఉన్నప్పటికీ, వినియోగానికి కావలసిన లోహాల్లో అధిక భాగం ఇప్పటికీ చైనా నుంచే దిగుమతి అవుతోంది.
ఈ పరిస్థితుల్లో, అమెరికా టారిఫ్ విధానానికి ప్రపంచ దేశాల నుండి మినహాయింపు లేకుండా అమలు చేస్తున్నది. ముఖ్యంగా చైనాకు ఒక్క శాతం కూడా మినహాయింపు లేదని ట్రంప్ తేల్చిచెప్పారు.
ఈ పరిణామాల మధ్య చైనా తన పొరుగుదేశాలతో మైత్రీ బంధాలు బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే వియత్నాం వెళ్లగా, త్వరలో మలేసియా, కంబోడియా పర్యటనలు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి.