
Qisas Islamic law: నిమిష ప్రియ 'ఖిసాస్' ఎదుర్కొవాల్సిందే?.. ఏంటీ ఈ ఇస్లామిక్ చట్టం ?
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియాకు సంబంధించిన క్షమాభిక్ష అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. హత్య కేసులో దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధించడంపై అంతర్జాతీయంగా స్పందనలు వస్తున్నా,బాధితుడైన తలాల్ అబ్దో మెహ్దీ కుటుంబం మాత్రం తమ కఠినమైన వైఖరిని కొనసాగిస్తోంది. నిమిష ప్రియ నేరం చేసినదే అని, తగిన శిక్ష అనుభవించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఆమెకు క్షమాభిక్ష ఇవ్వడం అసంభవమని తేల్చేశారు."మా డిమాండ్ ఒక్కటే... ఖిసాస్(Qisas),అది కూడా ఖురాన్ ప్రకారం 'తలకు తల' "అని తలాల్ సోదరుడు అబ్దుల్‌ఫత్తా మెహ్దీ బీబీసీకి స్పష్టం చేశారు. "మాకు ఎలాంటి పరిహారం అవసరం లేదు. ఖిసాస్ తప్ప ఇంకే విషయాన్ని మేము ఆమోదించం.ఇది దేవుని చట్టం" అని అబ్దుల్‌ఫత్తా తేల్చి చెప్పారు.
వివరాలు
ఖిసాస్ అంటే ఏమిటి?
అలాగే, వారి కుటుంబం ఒక్క మిలియన్ డాలర్ల 'బ్లడ్ మనీ' కోసం ఎదురు చూస్తోందన్న వార్తలను ఆయన ఖండించారు. "ఇది న్యాయబద్ధమైన ప్రతీకారంపై ప్రజల్లో తప్పుదారి చూపించే ప్రకటన. ఈ కేసు ఖిసాస్ కింద పరిష్కరించాల్సిందే" అని ఆయన తన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేశారు. ఇస్లామిక్ చట్టంలో 'ఖిసాస్' అనే పదానికి ప్రతీకార న్యాయం అనే అర్థం ఉంది. అంటే 'జీవానికి జీవం'అనే సూత్రం.ఒకరి ప్రాణం తీశారు కాబట్టి ఆయనకూ అదే శిక్ష విధించాలి అనే భావన దీనిలో ఉంటుంది. ఖురాన్‌లో సూరా బఖరా (అధ్యాయం 2),వచనం 178లో 'ఖిసాస్'కు సంబంధించిన ప్రస్తావన ఉంది.
వివరాలు
నిమిష ప్రియకు క్షమాభిక్ష లభించే అవకాశాలు తక్కువ
అందులో ప్రాణహానికి ప్రతిగా మరణశిక్ష (Qisas for Life) ఇవ్వాలని పేర్కొన్నారు. శరీర భాగాలను నాశనం చేసినప్పటికీ అదే తరహా శిక్ష విధించాలని (Qisas for Body Parts) చెప్పబడింది. అయితే ప్రస్తుతానికి తలాల్ కుటుంబం 'ప్రాణానికి ప్రతిగా ప్రాణమే' అనే నిబంధన అమలుపరచాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నిమిష ప్రియకు క్షమాభిక్ష లభించే అవకాశాలు మరింత మందగించాయి. జులై 16 (బుధవారం) న నిమిష ప్రియకు మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే భారత ప్రభుత్వం, సామాజిక కార్యకర్తల ప్రయత్నాల వల్ల అది తాత్కాలికంగా ఆపేశారు. యెమెన్ ప్రభుత్వం తమ అనుమతి లేకుండా ఈ శిక్షను వాయిదా వేసిందని తలాల్ సోదరుడు అబ్దుల్‌ఫత్తా ఆరోపిస్తున్నారు.
వివరాలు
మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్న శామ్యూల్ జెరోమ్
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, సామాజిక హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ కలిసి నిమిష ప్రియకు న్యాయం కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. యెమెన్‌లో అమలవుతున్న షరియా చట్టం ప్రకారం ఖిసాస్‌ను సాధారణంగా అమలు చేయరు. కానీ హౌతీ రెబల్స్ ఆధీనంలో ఉన్న సనా ప్రాంతాల్లో మాత్రం ఈ శిక్ష అమలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక నిమిష ప్రియను ఉరి శిక్ష నుంచి రక్షించాలంటే తలాల్ కుటుంబాన్ని ఒప్పించడం ఒక్కటే మార్గంగా మిగిలింది. ఈ దిశగా మానవతా దృష్టితో, సామాజికంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి.