Page Loader
Trump: ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటిస్తారా? మీడియా నివేదికలపై స్పందించిన వైట్ హౌస్
ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటిస్తారా? మీడియా నివేదికలపై స్పందించిన వైట్ హౌస్

Trump: ట్రంప్ పాకిస్తాన్‌లో పర్యటిస్తారా? మీడియా నివేదికలపై స్పందించిన వైట్ హౌస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ మీడియాలో గురువారం విస్తృతంగా వార్తలు ప్రసారం అయ్యాయి. దక్షిణాసియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఈనెల 18వతేదీన ఇస్లామాబాద్‌లో పర్యటించనున్నారని,ఆ తరువాత భారత్‌కు వెళ్లనున్నారని పాకిస్థాన్ టీవీ ఛానళ్ళు వివరించాయి. అంతేకాకుండా ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ కూడా ఈ పర్యటన గురించి ఊహాగానాలు వ్యాప్తి చేసింది. అయితే తాజాగా పాకిస్థాన్‌లో వెలువడిన ఈ వార్తలపై అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా స్పందించింది. ట్రంప్ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ట్రంప్‌కు పాకిస్థాన్ పర్యటన షెడ్యూల్ ఏదీ లేదని,పాకిస్థాన్ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించింది. ప్రస్తుతానికి అలాంటి పర్యటనకు ఎలాంటి షెడ్యూల్ లేదని స్పష్టంగా పేర్కొంది.

వివరాలు 

 జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్‌కి ట్రంప్ 

ఇదే విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ కూడా ధృవీకరించారు. ట్రంప్ పర్యటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. ఇక ట్రంప్ సంబంధిత మరిన్ని వివరాలు వెల్లడించిన వైట్‌హౌస్ ప్రకారం,ఆయన జూలై 25 నుంచి జూలై 29 వరకు స్కాట్లాండ్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్,యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో వాణిజ్య చర్చలు నిర్వహించనున్నారని చెప్పారు. స్కాట్లాండ్‌లోని టర్న్‌బెర్రీ,అబెర్డీన్ ప్రాంతాలను ట్రంప్ సందర్శించనున్నారని వివరించారు. అమెరికా-యూకే దేశాల మధ్య మరింత మెరుగైన వాణిజ్య ఒప్పందం కుదిర్చే లక్ష్యంతో ట్రంప్ ఈ పర్యటనను నిర్వహించనున్నట్లు లీవిట్ స్పష్టం చేశారు.