Page Loader
PM Modi: కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్‌ సదస్సులో మోదీ పిలుపు 
కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్‌ సదస్సులో మోదీ

PM Modi: కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్‌ సదస్సులో మోదీ పిలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా నిలిచే ఖనిజాలను (క్రిటికల్ మినరల్స్) దేశాలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని, ఇవి ఇతరులపై ఒత్తిడి సాధించేందుకు ఆయుధాల్లా మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ ఖనిజాల సరఫరాకు గల అంతర్జాతీయ గొలుసును సమిష్టిగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా 'బహుళపక్షవాదం, ఆర్థిక వ్యవహారాలు,కృత్రిమ మేధ' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి,ఎందుకంటే ఇటీవల చైనా ఈ క్రిటికల్ మినరల్స్‌పై నియంత్రణలు విధించడం,అవి జిత్తులమారి విధానంలో పంపిణీ చేయడం పై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఏఐ వృద్ధికి సరైన ప్రమాణాలు అవసరం 

ఈ ఖనిజాలు అంటే లిథియం, నికెల్, గ్రాఫైట్ వంటివి.. ఇవి ఈవీలు, బ్యాటరీల నిల్వలు, డ్రోన్లు వంటి ఆధునిక పరికరాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. కృత్రిమ మేధ (ఏఐ) రోజు వారి జీవితం లో సౌలభ్యాన్ని పెంచుతున్నప్పటికీ, దీని దుర్వినియోగం వల్ల ప్రమాదాలు దాపురించవచ్చని మోదీ హెచ్చరించారు. డిజిటల్ కంటెంట్ నిజమైనదా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే సంవత్సరం భారతదేశంలో 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు' నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

వివరాలు 

గ్లోబల్ సౌత్ దేశాలకు బ్రిక్స్ మద్దతు కొనసాగాలి 

గ్లోబల్ సౌత్ దేశాల ఆశలు, అంచనాల నేపథ్యంలో బ్రిక్స్ వాటికి మరింత మద్దతు ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ దిశగా శాస్త్రీయ పరిశోధనల భాండాగారం ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అంతర్జాతీయ పరిపాలనలో సంస్కరణల కోసం బ్రిక్స్ దేశాలు ముఖ్య భూమిక వహించాలన్న అభిప్రాయాన్ని చైనా ప్రధాని లీ కియాంగ్ వ్యక్తం చేశారు. ఈ ఏడాది చైనా 'బ్రిక్స్ పరిశోధనా కేంద్రం' స్థాపించనున్నట్టు ప్రకటించారు.

వివరాలు 

పర్యావరణ పరిరక్షణకు అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత 

పర్యావరణ రక్షణ లక్ష్యాలు, ప్రస్తుత ఆర్థిక వనరుల మధ్య లోటును తగ్గించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా నిధులు కేటాయించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల కారణంగా ఆహార,ఇంధన,ఆర్థిక సంక్షోభాల బారిన పడుతున్న దేశాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ అధ్యక్షతను చేపట్టనున్నభారత్,మానవతా ధోరణులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టంగా చెప్పారు. 'బిల్డింగ్ రెసీలియన్స్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ' అనే నూతన దృష్టికోణంతో బ్రిక్స్‌ను పునర్నిర్వచించేందుకు భారత్ కృషి చేస్తుందన్నారు. గతంలో జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు భారత్ గ్లోబల్ సౌత్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని మోదీ ఈ సందర్భంలో గుర్తుచేశారు. ఇప్పుడు బ్రిక్స్‌లోనూ ప్రజలే కేంద్రబిందువుగా ఉండే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

వివరాలు 

భవిష్యత్తుపై విశ్వాసం పెంపొందించాలి 

భవిష్యత్తుపై అభివృద్ధి చెందిన దేశాలకు ఉన్న నమ్మకాన్ని ఇతర దేశాలకూ కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తున్నప్పటికీ, పారిస్ ఒప్పందాలలో ఇచ్చిన హామీలను సమయానుసారంగా అమలు చేసిన తొలి దేశం మన దేశమేనని గుర్తుచేశారు. 2070 నాటికి 'నెట్ జీరో' లక్ష్యాన్ని చేరుకునే దిశగా నడుస్తున్నామని తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి భూమిని కాపాడేందుకు సమయం వచ్చినప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోలేమన్నారు.

వివరాలు 

మలేసియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు 

బ్రిక్స్ సదస్సు సందర్భంలో మోదీ మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో రియోలో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం వంటి అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సమీక్ష అంశంపై కూడా ఇద్దరూ సమాలోచనలు జరిపారు.

వివరాలు 

ఇతర దేశాధినేతలతో సమావేశాలు 

క్యూబా అధ్యక్షుడు మియో డియాజ్ కనెల్ బెర్ముడెజ్‌తో మోదీ సమావేశమయ్యారు. క్యూబాలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రస్తావించారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ అల్బర్టో ఆర్సె క్యాటకోరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమందు ఓర్సిలతో విడివిడిగా భేటీ అయ్యి, పరస్పర సహకారాన్ని పెంచే దిశగా చర్చలు జరిపారు.