
Nimisha Priya: 'క్షమించేది లేదు': నిమిషా ప్రియను ఉరితీయాల్సిందే.. పట్టుబడుతున్న మృతుడు కుటుంబసభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. నేడు అమలుకావాల్సిన ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కొంత ఉపశమనం లభించింది. అయితే మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబ సభ్యులు మాత్రం నిమిష ప్రియను తప్పించకూడదని,ఆమెకు శిక్ష ఖచ్చితంగా అమలవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు తలాల్ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టం చేశారు. నిమిష ప్రియ తప్పించుకునే అవకాశమే లేదని, బ్లడ్‌మనీను ఆమోదించబోమని తేల్చిచెప్పారు. ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేయగానే అబ్దుల్ ఫత్తా మెహది ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
వివరాలు
యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న భారత విదేశాంగశాఖ
''మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు.. మేము ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. ఈ వాయిదాను మేము ఊహించలేదు. మనిషి ప్రాణానికి డబ్బుతో విలువ నిర్ణయించలేం. మాకు న్యాయం దక్కాల్సిందే'' అని స్పష్టం చేశారు. అలాగే నిమిష ప్రియను బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఖండించారు. ఇక నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా గురించి భారత విదేశాంగశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. నిమిష ప్రియ విషయంలో యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
వివరాలు
మృతుడి కుటుంబానికి ఒక మిలియన్ డాలర్లు చెల్లించడానికి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు రెడీ
''నిమిష ప్రియ కుటుంబం,మృతుడి కుటుంబం పరస్పర అంగీకారానికి రావాలని,కేసు పరిష్కారానికి మరింత సమయం ఇవ్వాలని గత కొన్ని రోజులుగా భారత్ యెమెన్ ప్రభుత్వాన్ని కోరింది.స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌తో చేసిన క్రమమైన సంప్రదింపుల ఫలితంగా శిక్ష వాయిదా పడింది'' అని వివరించింది. ఇదిలాఉంటే.. నిమిష ప్రియ కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబానికి ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.6 కోట్ల రూపాయలు) క్షమాపణ ధనంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి బాధిత కుటుంబం అంగీకరిస్తే..నిమిష ప్రియకు మరణ శిక్ష తప్పే అవకాశం ఉంటుంది. ఇందుకోసం మతపరమైన నేత కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మృతుడి కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచర్చలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది.