
US Visa: సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టారో.. అమెరికా వీసా రాదు..!
ఈ వార్తాకథనం ఏంటి
వలస విధానాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నఅమెరికా ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
యూదులపై వ్యతిరేక దృక్కోణాన్ని కలిగిన సోషల్ మీడియా పోస్టులను చేసిన వారు అమెరికా వీసా (US Visa) లేదా గ్రీన్‌కార్డు (Green Card) పొందలేరని స్పష్టం చేసింది.
ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. స్టూడెంట్ వీసాలు పొందాలనుకునే అభ్యర్థుల నుంచి శాశ్వత నివాస హక్కులు కోరే వారివరకు అందరి సోషల్ మీడియా ఖాతాలను గమనించాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలస సేవలు (USCIS) పేర్కొంది.
వారి సామాజిక మాధ్యమాల్లోని వ్యాసాలు, పోస్టులు, అభిప్రాయాలపై గట్టి నిఘా ఉంటుంది.
వివరాలు
ఉగ్రవాద భావజాలాన్ని కలిగిన వారికీ అమెరికాలో స్థానం లేదు
అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా, యెమెన్‌కు చెందిన హూతీలు వంటి గ్రూపులకు మద్దతు తెలపడం కూడా యూదు వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుంది.
ఈ గ్రూపులను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ప్రచారం చేయడం ద్వారా తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశముందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.
''ఉగ్రవాద భావజాలాన్ని కలిగిన వారికీ అమెరికాలో స్థానం లేదు.అలాంటి వ్యక్తులను దేశంలోకి అనుమతించాల్సిన అవసరం మాకు లేదు,వాస్తవానికి అటువంటి వారిని ఇక్కడ ఉంచాల్సిన అవసరమే లేదు'' అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ట్రికియా మెక్‌లాఫ్లిన్ స్పష్టం చేశారు.
వివరాలు
వలసదారులపై మరింత కఠినమైన వైఖరి
ఇలాంటి ఆచరణలు చేపట్టినవారికి వీసా జారీ చేయబోమని, శాశ్వత నివాస అవకాశాలూ పూర్తిగా మూసివేయబడతాయని ఆమె తెలిపారు.
ఇప్పటికే వీసా పొందిన వారు అలాంటి పోస్టులు చేస్తే వారి వీసా స్థాయి రద్దయ్యే అవకాశముందన్న స్పష్టతనూ ఇచ్చారు.
ఇక, 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై మరింత కఠినమైన వైఖరిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా పాలస్తీనా మద్దతు తెలిపే ఆందోళనల్లో పాల్గొంటున్న విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసి, వారిని తిరిగి తమ దేశాలకు పంపించడంలో అమెరికా ముందంజలో ఉంది.
గత నెలలో మాత్రమే 300 మందికి పైగా విదేశీయుల వీసాలు రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.