LOADING...
Modi Japan Visit: టోక్యో చేరుకున్న మోదీ.. చివరి నిమిషంలో అమెరికాకు షాకిచ్చిన జపాన్‌
టోక్యో చేరుకున్న మోదీ.. చివరి నిమిషంలో అమెరికాకు షాకిచ్చిన జపాన్‌

Modi Japan Visit: టోక్యో చేరుకున్న మోదీ.. చివరి నిమిషంలో అమెరికాకు షాకిచ్చిన జపాన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన టోక్యోకు చేరుకోవడంతో ఈ పర్యటన ప్రారంభమైంది. ఈ సందర్శనలో భాగంగా మోదీ ఈ సాయంత్రం జపాన్ ప్రధాని ఇషిబాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. అయితే, మోదీ పర్యటన సమయంలోనే జపాన్ వాణిజ్య మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

అమెరికా - జపాన్  550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ఆలస్యం 

అసలు ప్రణాళిక ప్రకారం జపాన్ వాణిజ్య మంత్రి ర్యోసీ అకజవా గురువారం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలపై చర్చించేందుకు ఆయన పర్యటన ఉండగా,చివరి నిమిషంలో దానిని రద్దు చేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య కుదరాల్సిన 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందం ఆలస్యం కానుంది. అమెరికా విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో టోక్యో ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్‌పై విధించిన టారిఫ్‌లను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారిక ఒప్పందం ర్యోసీ అమెరికా పర్యటనలో కుదరాల్సి ఉండగా, పర్యటన రద్దు కారణంగా అది సాధ్యం కాలేదు.

వివరాలు 

15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్న మోదీ 

పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని విషయాలు తేల్చాల్సి ఉన్నందువల్లే ర్యోసీ తన పర్యటనను రద్దు చేశారని జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఇదే సమయంలో మోదీ పర్యటన జపాన్‌లో సాగుతుండటంతో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆగస్టు 29,30 తేదీల్లో ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించనున్నారు.ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని,అనంతరం జపాన్ ప్రధాని ఇషిబాతో భేటీ అవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,సెమీకండక్టర్లు,బుల్లెట్ రైలు,పెట్టుబడులు వంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. జపాన్ పర్యటన అనంతరం మోదీ నేరుగా చైనా వెళ్లనున్నారు.ఆగస్టు 31,సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

వివరాలు 

ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ జపాన్-చైనా పర్యటనలు  

2020లో లద్దాఖ్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనా సందర్శించబోతున్నది ఇదే మొదటిసారి. అంతకు ముందు 2018లో ఆయన ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన చైనా పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాలతో భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న వేళ, మోదీ జపాన్-చైనా పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.