Page Loader
Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్‌ 
షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్‌

Muhammad Yunus: షేక్ హసీనా రాజకీయ ప్రకటనలను ఆపాలని అభ్యర్థిస్తే.. మోదీ అంగీకరించలేదు: యూనస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం. ఆమె న్యూఢిల్లీ నుంచే సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఈ అంశాన్ని చర్చించానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహమ్మద్‌ యూనస్‌ పేర్కొన్నారు. హసీనా చేసే వ్యాఖ్యలను నియంత్రించాలని కోరినప్పటికీ మోదీ ఆ అభ్యర్థనను తోసిపుచ్చినట్టు ఆయన తెలిపారు. లండన్‌లోని చాఠమ్‌ హౌస్‌ వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో యూనస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

వివరాలు 

అది సోషల్ మీడియా 

కొద్ది నెలల క్రితం బిమ్‌స్టెక్‌ సమావేశ సందర్భంగా మోదీతో తాను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు యూనస్‌. అప్పటి సంభాషణ వివరాలు తెలియజేస్తూ.. ''షేక్ హసీనాకు భారత్‌ ఆశ్రయం ఇవ్వడం విషయమై నేను వ్యాఖ్యానించను. అది పూర్తిగా మీ దేశ విధానానికి సంబంధించిన విషయం. కానీ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ బంగ్లాదేశ్‌లోని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మా దేశంలో ఉద్రిక్తతను పెంచుతోంది. అందుకే మీరు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆమెను ఇలాంటి ప్రకటనలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతున్నాను''అని మోదీని కోరినట్టు తెలిపారు. దీనికి స్పందనగా మోదీ.. ''అది సోషల్ మీడియా.. దాన్ని నియంత్రించడం మా చేతిలో లేదు'' అని చెప్పారు అని యూనస్‌ పేర్కొన్నారు.