LOADING...
PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి

PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు అడుగుపెట్టారు.షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత,మోదీ చైనాను సందర్శించడం ఇదే మొదటి సారి. ఆయన చివరిసారి చైనాకు 2018లో వెళ్లిన విషయం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్, చైనా కలిసి పని చేయాలి 

జపాన్‌లో రెండు రోజుల పర్యటనను పూర్తిచేసిన తరువాత, ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31,సెప్టెంబర్ 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న SCO శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా అనేక ఇతర దేశాల నేతలతో ప్రధానీ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్, చైనా కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

వివరాలు 

జపాన్ పర్యటన భారత ప్రజలకు ప్రయోజనం

భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తన జపాన్‌ పర్యటన కొనసాగిందని ప్రధాని మోదీ 'ఎక్స్‌' ద్వారా వెల్లడించారు. ఈ పర్యటనలో, భారత్, జపాన్ మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయినట్లు తెలుస్తోంది. అలాగే, వచ్చే దశాబ్దంలో భారతదేశంలో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ సుముఖత వ్యక్తంచేసింది. సెమీకండక్టర్లు, క్లీన్‌ ఎనర్జీ, టెలికాం వంటి కీలక రంగాలు, అలాగే ముఖ్యమైన ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఇరు దేశాలు సహకారం పెంచడానికి అంగీకరించాయి.