Page Loader
Putin-Zelensky: క్రెమ్లిన్ కీలక ప్రకటన.. జెలెన్స్కీతో చర్చలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం
క్రెమ్లిన్ కీలక ప్రకటన.. జెలెన్స్కీతో చర్చలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం

Putin-Zelensky: క్రెమ్లిన్ కీలక ప్రకటన.. జెలెన్స్కీతో చర్చలకు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమని వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అవసరమైతే ఈ సమావేశం జరుగుతుందని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. అయితే, జెలెన్‌స్కీ అధ్యక్ష పదవికి సంబంధించి చట్టబద్ధతపై రష్యా సందేహాలు వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాలో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చర్చలపై ఆసక్తి నెలకొంది.

వివరాలు 

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-రష్యా అధికారిక చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి కొనసాగుతోంది. అధికారంలోకి రాగానే ఈ యుద్ధాన్ని ముగిస్తానని డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే ఆయన ఈ దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా, అమెరికా-రష్యా మధ్య ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అధికారిక చర్చలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పాల్గొన్నారు. అయితే, ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు ప్రాతినిధ్యం దక్కలేదు. ''మా విషయాన్ని మేము లేకుండా నిర్ణయించడం మేము అంగీకరించము'' అని జెలెన్‌స్కీ ఇదివరకే స్పష్టంగా తెలిపారు.

వివరాలు 

 ట్రంప్, పుతిన్ నేరుగా కలుసుకునే అవకాశం 

ఈ చర్చల్లో ట్రంప్, పుతిన్ నేరుగా కలుసుకునే అవకాశముందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు, పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉన్న జెలెన్‌స్కీ కూడా ఈ చర్చల్లో పాల్గొనవచ్చనే సమాచారం బయటకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిణామాలు కలకలం రేపుతున్నాయి. మాస్కోపై ట్రంప్ ప్రదర్శిస్తున్న సానుకూల వైఖరిని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు, నాటో సభ్యులు ఆందోళనగా వీక్షిస్తున్నాయి.

వివరాలు 

కీవ్‌కు మిలిటరీ సాయం.. ఈయూ దేశాలు సమాలోచనలు

ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం సాధ్యపడదని ట్రంప్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో, యూరోప్‌కు స్వంత రక్షణ వ్యవస్థ అవసరమని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. అమెరికా తన వైఖరిని మారుస్తున్న నేపథ్యంలో, యూరోపియన్ యూనియన్ కూడా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తోంది. ఉక్రెయిన్‌ను ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదని భావిస్తున్న కొన్ని ఈయూ దేశాలు, కీవ్‌కు మిలిటరీ సాయం అందించాల్సిందిగా సమాలోచనలు జరుపుతున్నాయి.