LOADING...
Iran-Russia: ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా? అంతర్జాతీయంగా చర్చ
ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా? అంతర్జాతీయంగా చర్చ

Iran-Russia: ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా? అంతర్జాతీయంగా చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. రష్యా ప్రభుత్వం దశలవారీగా ఇరాన్‌కు డ్రోన్లు పంపిస్తోందని విదేశీ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఈ సరఫరా పూర్తయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించాయి. డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలు వంటి అవసరమైన సరుకులను కూడా రష్యా పంపిస్తోందని సమాచారం. పశ్చిమ దేశాల నిఘా సంస్థల సమాచారం ప్రకారం, ఇరాన్ అభివృద్ధి చేసిన డ్రోన్లను రష్యా తయారు చేసి, వాటిని ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగిస్తోంది. అదే సమయంలో, ఇరాన్ సైనిక శక్తిని మరింత పెంచే లక్ష్యంతో ఈ రవాణాలు జరుగుతున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.

వివరాలు 

రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ సహాయం?

అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాలపై సమాచారం ఇరాన్‌కు రష్యా రియల్‌టైమ్‌లో అందిస్తోందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమాచార మార్పిడి జరుగుతోందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి స్పందిస్తూ, "ప్రస్తుతం చాలా ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇరాన్ నాయకత్వంతో మా సంప్రదింపులు మాత్రం కొనసాగుతున్నాయి" అని స్పష్టం చేశారు.

వివరాలు 

ఇరాన్‌లోని రష్యా ఉద్యోగులు వెనక్కి..

ఇదిలా ఉంటే, ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రష్యా తమ సిబ్బందిని వెనక్కి పిలిపించింది. ఇటీవల ఆ ప్లాంట్‌పై క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో మంగళవారం 163 మంది ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అణు కేంద్రాన్ని రష్యానే నిర్మించింది. ప్రస్తుతం అక్కడ మరికొన్ని యూనిట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ కార్యకలాపాలను రష్యా నిలిపివేసింది.

Advertisement