రష్యా సంచలన నిర్ణయం.. చైనాలో పర్యటించేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబరులో చైనాలో పర్యటించనున్నారు. బీజింగ్‌లో జరగనున్న బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు చైనా అధ్యక్షుడు ఆహ్వానం మేరకు పుతిన్ హాజరుకానున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలను వెలువరించాయి. మరోవైపు పుతిన్ చైనా పర్యటనకు క్రెమ్లిన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.గత ఏడాదికిపైగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను కొనసాగిస్తోంది.ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ మార్చిలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ICC సభ్యత్వ దేశాల్లో కనిపిస్తే అరెస్ట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పుతిన్ ఇప్పటివరకు రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు.
ఐసీసీ వారెంట్ తర్వాత పుతిన్ చేయనున్న తొలి విదేశీ పర్యటన చైనానే
అరెస్ట్ ముప్పు మేరకు ఇటీవలే దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు పుతిన్ గైర్హాజరయ్యారు.సెప్టెంబరులో భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగే G-20 దేశాధినేతల సమావేశానికి పుతిన్ రావట్లేదని ఇప్పటికే రష్యా వెల్లడించింది. ఐసీసీ నిబంధనలను భారత్ అమలు చేయాల్సిన అవసరం లేదు. అయినా పుతిన్ సదస్సుకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపించలేదు.అక్టోబరులో చైనా వెళ్లేందుకు ఊవ్విళ్లూరడంపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది. ఉక్రెయిన్‌లో సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.ఈ క్రమంలోనే బీజింగ్‌తో పుతిన్ మరింత బలమైన బంధం ఏర్పాటు చేసుకుంటున్నారు. చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్, మార్చిలో మాస్కోలో పర్యటించారు. ఈ మేరకు పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.ఐసీసీ వారెంట్ తర్వాత పుతిన్ చేయనున్న తొలివిదేశీ పర్యటన చైనానే కావడం గమనార్హం.