Air pollution: పంజాబ్ నగరాల్లో తీవ్ర కాలుష్యం.. లాహోర్, ముల్తాన్‌లో లాక్‌డౌన్
గాలి కాలుష్యం దృష్ట్యా దిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా లాహోర్, ముల్తాన్ నగరాల్లో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగాయి, దీంతో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. ముల్తాన్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 2000ను దాటగా, లాహోర్‌లో ఇది 1100ని మించి కొనసాగుతోంది. లాహోర్ ప్రపంచంలో రెండవ అత్యంత కాలుష్య నగరంగా మారిందని పంజాబ్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ తెలిపారు. పొగమంచు, తీవ్ర కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం ముప్పు ఎదుర్కొంటోందన్నారు. కోవిడ్-19 సమయంలో ఏర్పడ్డ ప్రమాదాల కారణంగా తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ఇబ్బందుల్లో ప్రజలు
దీంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం, కాలుష్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 24 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక వారంలో 600,000 మందికి పైగా ప్రజలు కాలుష్య సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేసి, OPD సేవలు రాత్రి 8 గంటల వరకు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటూ, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.