
Muhammad Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా ప్రతిజ్ఞ.. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండమన్న యూనస్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నేను నా మాతృభూమికి తిరిగి వస్తా... మా పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా" అంటూ ఘాటుగా స్పందించారు.
హసీనా వ్యాఖ్యలపై యూనస్ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ, తగిన కౌంటర్ ఇచ్చింది.
వివరాలు
హసీనాను భారత్ నుంచి రప్పించడమే తమ లక్ష్యం - యూనస్ ప్రభుత్వం
మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి తిరిగి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని యూనస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం వెల్లడించారు.
"హసీనాను భారత్ నుంచి తిరిగి తీసుకురావడంపై మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆమెను విచారణకు గురిచేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాము" అని వివరించారు.
అలాగే బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు.
దేశంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో హత్యలు, బలవంతపు అరెస్టులకు పాల్పడినవారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
వివరాలు
త్వరలోనే తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటా - హసీనా
హసీనా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ఓ సమావేశంలో జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యకర్తలు ఓర్పుగా ఉండాలని, తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. గతంలో మాదిరిగా అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
"జూలై - ఆగస్టు నెలల్లో విద్యార్థుల నిరసనల కారణంగా అనేక మంది మరణించారు. పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యలకు కారణమైనవారిపై యూనస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి" అని హసీనా ప్రశ్నించారు.
వివరాలు
దేశంలో అనిశ్చితి పరిస్థితులు - హసీనా విమర్శలు
మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా దేశంలో అల్లర్లు ఆగడం లేదని హసీనా మండిపడ్డారు.
శాంతిభద్రతలు మరింత దిగజారుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విచారణ కమిటీలను రద్దు చేసి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులపై దాడులు చేయడం యూనస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. "ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాలి" అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
వివరాలు
భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న హసీనా
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన వివాదంతో విద్యార్థుల ఆందోళనలు ఊపందుకున్నాయి. దాంతో 2024 ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
అనంతరం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకుని, ప్రస్తుతం అక్కడే తలదాచుకుంటున్నారు.