Israel: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కాల్పులు ఉద్రిక్తతకు దారితీశాయి. లెబనాన్‌లో కేంద్రంగా ఉన్న హెజ్‌బొల్లా సంస్థను అణగదొక్కేందుకు ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఎంబసీ సమీపంలో కొందరు సాయుధ దుండగులు కాల్పులకు తెగబడగా, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక సాయుధుడు మరణించగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, రాయబార కార్యాలయం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ దాడితో సంబంధమున్న మరికొందరిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
ప్రజలు అత్యవరమైతే తప్ప బయటికి రావొద్దు
స్థానిక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో మొదలైన గాజా సంక్షోభం ఈ ఉద్రిక్తతలకు ముదిరింది. హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయెలీలను హత్య చేయడంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. హమాస్ ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 44,000 మంది ప్రాణాలు కోల్పోగా, 251 మందిని హమాస్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇజ్రాయెల్ మాత్రం 17,000 మంది మిలిటెంట్లను మాత్రమే మట్టుబెట్టినట్లు చెప్పింది.