సింగపూర్ లో రోబో సూపర్ పోలీస్.. చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచం సాంకేతికాన్ని ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఏలుతోంది. ఈ టెక్నిక్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోబోలు ఏ పనైనా చేస్తూ మానవ వనరులతో పోటీ పడుతున్నాయి. వైద్యపరంగా కీలకమైన ఆపరేషన్లనూ చేపడుతున్నాయి. 2023 సంవత్సరం ప్రారంభంలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ తమ పోలీస్ శాఖలో రోబోలను ప్రవేశపెట్టి సంచలన మార్పులకు తెరతీసింది. నగర నీధుల్లో ఇవి గస్తీ కాస్తూ పోలీస్ శాఖకు ఎంతో సహకరిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో సింగపూర్ పయనిస్తోంది. ఈ రోబోలకు ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, కెమెరాలు, సైరన్లను ఇప్పటికే అమర్చారు.
చాంగీ ఎయిర్ పోర్టులో తొలిసారిగా వినియోగం
తమకు తాముగా నిర్ణయం తీసుకునే రోబోలను తమ దేశ పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పోలీస్ రోబోలను గత 5 ఏళ్లుగా సింగపూర్ ప్రభుత్వం పరీక్షిస్తూ వస్తోంది. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు ఉండగా, 360 డిగ్రీల్లోనూ వీక్షించే సామర్థ్యం దీని సొంతం. ఏదైనా పెద్ద ఘటనలకు సంబంధించిన సమయంలో పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడే సందర్భాల్లో రోబోలు సమర్థంగా పని చేసి పెట్టగలవు. ఈ రోబో పోలీస్ సేవలను రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో తొలిసారిగా వినియోగించనున్నారు. ఈ రోబోల్లోనే స్పీకర్లను సైతం అమర్చారు. వీటి సాయంతో పోలీసులు, ప్రజలతో మాట్లాడుతూ వారి స్థితిగతులను తెలుసుకునేలా తీర్చిదిద్దారు.