
'Stratus' COVID variant: అమెరికాలో 'స్ట్రాటస్' కరోనా వేరియంట్ కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా (Corona) మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో కొత్త కొత్త వేరియంట్ల రూపంలో వెలుగుచూస్తూ, మానవులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో కొత్త వేరియంట్లు వ్యాపిస్తుండగా,తాజాగా అమెరికా (America)లో మరో కొత్త వేరియంట్‌ను వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వేరియంట్‌ను తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాసియాలో గుర్తించారు. దీన్ని XFG లేదా స్ట్రాటస్ (Stratus) అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ అమెరికా వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నట్లు వైద్యులు హెచ్చరించారు. అమెరికాలో మార్చి వరకు '0' కరోనా కేసులు ఉండగా, ఏప్రిల్‌లో 2%, మే చివరికి 6%, జూన్ చివరి నాటికి 14% కేసుల వరకు పెరిగాయి.
వివరాలు
ఈ రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు
అమెరికాలో అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదేవిధంగా కనెక్టికట్, జార్జియా, న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ బారినపడినవారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, ముక్కు బ్లాక్ అవ్వడం, అలసట, తలనొప్పి, వాంతులు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ విధమైన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వివరాలు
రెండు వేరియంట్ల మిశ్రమం వల్ల కొత్త లక్షణాలు ఉత్పన్నం అయ్యే అవకాశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ వేరియంట్ ఓమిక్రాన్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనది కాదని స్పష్టం చేసింది. అయితే, ఇది LF.7, LP.8.1.2 అనే రెండు వేరియంట్ల మిశ్రమం కావడంతో కొన్ని కొత్త లక్షణాలు ఉత్పన్నం కావచ్చని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా వెల్లడించింది. ఇదే సమయంలో NB.1.8.1, నింబుస్ (Nimbus) అనే మరో కొత్త వేరియంట్ కూడా అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది ముఖ్యంగా తీవ్రమైన గొంతు నొప్పిని కలిగిస్తోందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచించారు.