USAID:యూఎస్ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
యూఎస్ ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ప్రభావం భారత్‌పై కూడా పడినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
యూఎస్ ఎయిడ్ నుంచి భారత్‌కు అందుతున్న ఆర్థికసాయం నిలిచిపోవడంతో, దేశంలో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటుచేసిన మూడు క్లినిక్‌లు మూతపడినట్లు వార్తలు వెలువడ్డాయి.
దీనివల్ల దాదాపు 5,000 మంది వైద్య సేవలను పొందే అవకాశం కోల్పోయినట్లు సమాచారం. ఈ క్లినిక్‌లు హైదరాబాద్, కళ్యాణ్, పుణే ప్రాంతాల్లో స్థాపించారు.
2021లో హైదరాబాద్‌లో మొదటి క్లినిక్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
వీటి ద్వారా ట్రాన్స్‌జెండర్లకు హార్మోన్ థెరపీ, మందులు, మానసిక ఆరోగ్య పరిరక్షణ, హెచ్‌ఐవీ, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్, సాధారణ వైద్య సంరక్షణ, న్యాయ సహాయం వంటి సేవలు అందించేవారని వెల్లడించారు.
Details
ఒక్కొక్క క్లినిక్ కోసం రూ.30 లక్షల ఖర్చు
ఈ సేవల నిర్వహణకు వార్షికంగా ఒక్కొక్క క్లినిక్ కోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని సమాచారం.
అయితే ప్రస్తుతం యూఎస్ ఎయిడ్ నిధులు అందకపోవడంతో ఈ సేవలు నిలిచిపోయాయని తెలుస్తోంది.
భారత్‌లోని ఈ మూడు ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు మూసివేసిన విషయంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, రిపబ్లికన్ సెనేటర్ జాన్ కెన్నెడీ స్పందించారు.
అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ఎక్కడ వృథా అవుతున్నాయో ఇప్పటికైనా అర్థం అయ్యిందా అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
యూఎస్ ఎయిడ్ అనేది దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో ఆర్థికసాయం అందించే సంస్థ. ప్రపంచ దేశాల అభివృద్ధి, భద్రత కోసం ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను అందిస్తోంది.
Details
యూఎస్ ఎయిడ్ పై ఆధారపడిన దేశాలపై ప్రభావం
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ఎలాన్ మస్క్ నేతృత్వంలో 'డోజ్' (DOGE) అనే సంస్థను ఏర్పాటు చేశారు.
యూఎస్ ఎయిడ్ ద్వారా అధికంగా వృథా ఖర్చులు జరుగుతున్నాయని, ఇది నేరగాళ్ల సంస్థగా మారిందని మస్క్ ఆరోపించడంతో, తొలుత యూఎస్ ఎయిడ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఆ తర్వాత ఈ సంస్థలోని వేల మంది ఉద్యోగులను తొలగించి, పూర్తిగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
దీంతో ఇన్నాళ్లు యూఎస్ ఎయిడ్‌పై ఆధారపడిన దేశాలు తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.