USA- Canada: అమెరికన్లపై ట్రంప్ సుంకాల ప్రభావం.. కెనడా మంత్రి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచుతానని చేసిన బెదిరింపులకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కఠినంగా స్పందించింది.
ట్రంప్ సుంకాలు విధిస్తే, దాని ప్రభావం అమెరికన్లపైనే పడుతుందని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, ట్రంప్ చర్యలపై కెనడా కూడా సానుకూల ప్రతిస్పందన చేయదని స్పష్టంచేశారు.
మెలానీ జోలీ ఈ వాణిజ్య వివాదాన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్ద వాణిజ్య యుద్ధంగా అభివర్ణించారు.
వాణిజ్యంలో ఏదైనా చర్యకు తగిన ప్రతిస్పందన ఉంటుందని, ట్రంప్ తన హెచ్చరికలను అమలు చేస్తే దానికి ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని తెలిపారు.
ట్రంప్ నిర్ణయాలు కెనడా వినియోగదారులు, ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆమె వ్యాఖ్యానించారు.
Details
వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
ఇటీవల ట్రంప్ కెనడా, మెక్సికోపై 25శాతం సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించడంతో, వాణిజ్య వివాదం మరింత ముదిరింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ట్రంప్ చురకలంటిస్తూ, వలసలు, మాదక ద్రవ్యాల అక్రమరవాణా కట్టడి చేయలేకపోతే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేర్చాలని వ్యాఖ్యానించారు.
ట్రూడో తన ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన వారసుడిని ఎంపిక చేసే వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఈ విభేదాలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.