Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అమెరికానే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లా ప్రభుత్వం పడిపోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపణలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అయితే అమెరికా ఈ దుస్సాహసానికి పాల్పడటానికి వెనుక ఒక బలమైన కారణం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తాను అమెరికాకు అప్పగించనందునే ఆ దేశం ఇంతటి దుశ్చర్యకు ప్పాలడిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
'బంగ్లా భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నా'
తాను సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించే ఉంటే అధికారంలో కొనసాగేదాన్నని, అవామీ లీగ్ పార్టీ నేతలకు హసీనా సందేశం పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవంతో షేక్ హసీనా దిల్లీలోనే ఉంటున్నారు. ఛాందసవాసుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని, శాంతంగా ఉండాలని ఆమె కోరారు. ఒకవేళ తాను బంగ్లాదేశ్ లో ఉండి ఉంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారని, దేశ వనరులు, ప్రజల ఆస్తులు దెబ్బతినేవని షేక్ హసీనా చెప్పారు. అవామీ లీగ్ కు చెందిన నాయకులు హత్యకు గురయ్యారని వార్తలు చూస్తుంటే తన గుండె రోధిస్తోందని చెప్పారు. బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం తాను అల్లాను ప్రార్ధిస్తున్నానని హసీనా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.