
కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ
ఈ వార్తాకథనం ఏంటి
న్యూయార్క్ సహా తూర్పు అమెరికాలోని మిలియన్ల మంది ప్రజలు దట్టమైన పొగ కమ్మేడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
గత మూడు రోజులుగా ఇది దుస్థితి నెలకొంది. కెనడాలో చెలరేగిన కార్చిచ్చు పొగ న్యూయార్క్ నగరాన్ని పూర్తిగా కమ్మేసింది.
దీంతో న్యూయార్క్ రాష్ట్రంలో ఆకాశం నారింజ రంగులోకి మారింది.
దట్టమైన పొగ వల్ల నగరంలోని ప్రసిద్ధ స్కైలైన్ దాదాపుగా కనిపించకుండా పోయింది.
న్యూయార్క్ నగరంలోని కాలుష్య స్థాయి రికార్డు స్థాయికి చేరుకుంది. దిల్లీని కూడా అధిగమించడం గమనార్హం.
న్యూయార్క్‌లో వారం మొత్తం దట్టమైన పొగ వ్యాపిస్తూనే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా
కెనడా కార్చిచ్చు ఎలా మొదలైంది?
మే, జూన్ నెలల్లో వేసవిలో కెనడాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో కార్చిచ్చులు సర్వసాధారణంగా చెలరేగుతుంటాయి.
ఈ ఏడాది కూడా చాలా చోట్ల మంటలు వ్యాపించాయి. ఈసారి కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య వేగంగా వ్యాపించే మంటలను ఎదుర్కోవడం అధికారులకు కష్టంగా ఉంది.
కెనడా అంతటా మంటలు చెలరేగడంతో 20,000 మంది నిరాశ్రయులయ్యారు. కెనడాలో 414 చోట్ల అడవులు కాలిపోతున్నాయి.
వాటిలో 239 నియంత్రణలో లేవని కెనడియన్ ఇంటరాజెన్సీ ఫారెస్ట్ ఫైర్ సెంటర్ తెలిపింది.
మంటలను అదుపు చేసేందుకు యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి అగ్నిమాపక సిబ్బంది, నిపుణులు రంగంలోకి దిగారు.
అమెరికా
కెనడాలో కార్చిచ్చు చెలరేగితే పొగ అమెరికాను ఎందుకు కమ్ముకుంటోంది?
కెనడాలో మంటలు చెలరేగడం వల్ల వచ్చే పొగ అమెరికాకు చేరుతోంది. బలమైన గాలులు చాలా దూరం వరకు పొగను అమెరికా తూర్పు ప్రాంతాల వేపు లాక్కెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కెనడాలో నోవా స్కోటియా సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గాలి అపసవ్య దిశలో తిరుగుతోంది.
ఈ క్రమంలో వీస్తున్న బలమైన గాలులు దట్టమైన పొగను న్యూయార్క్ తోపాటు అమెరికా తూర్పు తీర రాష్ట్రాల వైపు పొగను లాక్కెళ్తున్నాయి.
అమెరికా
అమెరికా ప్రభుత్వం అప్రమత్తం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచన
గత మూడు రోజులుగా తూర్పు రాష్ట్రాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు N95 ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో న్యూయార్క్‌లో 'కోడ్ రెడ్' హెచ్చరికను జారీ చేశారు.
న్యూయార్క్ నగరంలోని గాలినాణ్యత దారణంగా పడిపోయింది. గాలి నాణ్యత అతి తక్కువగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల జాబితాలో న్యూయార్క్ నాల్గవ స్థానంలో నిలిచింది.
1960 తర్వాత అత్యంత దారుణమైన 484 ఐక్యూ స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత హెచ్చరిక కారణంగా న్యూయార్క్ పాఠశాలల్లో బహిరంగ కార్యకలాపాలను రద్దు చేశాయి.
ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, విమానాలు ఆలస్యం కావడంతో పాటు జన జీవనం స్తంభించిపోయింది.