
Russia: భారత ఉత్పత్తులకు రష్యా బంపర్ ఆఫర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఆంక్షల కారణంగా భారత ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, రష్యా భారతదేశానికి కీలకమైన భరోసా ఇచ్చింది. ఒకవేళ అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు అవరోధాలు తలెత్తితే, రష్యా తన దేశ మార్కెట్‌ను భారత వస్తువులకు పూర్తిగా తెరిచి పెడతామని స్పష్టం చేసింది. భారత ఉత్పత్తులను సాదరంగా ఆహ్వానిస్తామని ప్రకటిస్తూ రష్యా బంపర్ ఆఫర్ అందించింది. భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా అవలంబిస్తున్న విధానం ఏకపక్షమని, అన్యాయమని రష్యా ఘాటుగా విమర్శించింది. ఢిల్లీలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
భారత్-రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని ధీమా
"భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో సమస్యలు ఎదుర్కొంటే,రష్యా మార్కెట్ ఆ ఉత్పత్తులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఆంక్షలు విధించే దేశాలకే చివరికి నష్టాలు కలుగుతాయి. ఇది భారత్‌కు సవాలుతో కూడిన పరిస్థితి అయినప్పటికీ, మేము భారత్‌తో ఉన్న బంధంపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నాం"అని ఆయన స్పష్టం చేశారు. బాహ్య ఒత్తిళ్లు ఎంత ఉన్నా, ఇంధన రంగంలో భారత్-రష్యా సహకారం నిరాటంకంగా కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగా,ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతి చేస్తున్న భారత్‌పై ఆగస్టు 27 నుంచి అదనంగా 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
వివరాలు
స్నేహితులు అలా ప్రవర్తించరంటూ అమెరికాపై రష్యా విమర్శ
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్-రష్యా సంబంధాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. "పశ్చిమ దేశాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయంటే, మీరు సరైన దారిలో వెళ్తున్నారని అర్థం. వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరిస్తూ నయా వలసవాద ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నిజమైన స్నేహితులు ఇలాంటివి చేయరు" అంటూ ఆయన అమెరికా విధానంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి ఉక్రెయిన్ పరిస్థితులపై వివరాలు తెలియజేశారని బాబుష్కిన్ వెల్లడించారు. దీని ద్వారానే రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో స్పష్టమవుతుందని ఆయన అన్నారు.
వివరాలు
రష్యా పర్యటనలో ఎస్. జైశంకర్
ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉండటం, ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం చేకూర్చింది. ఈ పరిణామాల మధ్య రష్యా అధికారుల తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌కు రష్యానే అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అని,భారత ఇంధన అవసరాలు ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతున్నాయని బాబుష్కిన్ గుర్తుచేశారు.