Page Loader
Trump-Trudeau: అమెరికా సుంకాల విషయంలో కెనడాకు తాత్కాలిక ఊరట.. స్పందించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో 
అమెరికా సుంకాల విషయంలో కెనడాకు తాత్కాలిక ఊరట.. స్పందించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో

Trump-Trudeau: అమెరికా సుంకాల విషయంలో కెనడాకు తాత్కాలిక ఊరట.. స్పందించిన కెనడా అధ్యక్షుడు ట్రూడో 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెక్సికో, కెనడా దేశాలను సుంకాల భయంతో ఒత్తిడికి గురి చేసినప్పటికీ, తాజాగా ఈ రెండు దేశాలకు కొంత ఉపశమనం కల్పించారు. అమెరికా సరిహద్దుల వద్ద భద్రతను బలోపేతం చేస్తామని ఇరుదేశాల నేతలు హామీ ఇవ్వడంతో, ట్రంప్‌ నెల రోజుల పాటు టారిఫ్‌ల (US Tariffs) అమలును నిలిపివేశారు. ఈ పరిణామాలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ, ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతించారు.

వివరాలు 

కెనడా-యూఎస్‌ జాయింట్‌ స్ట్రయిక్‌ ఫోర్స్‌

''అధ్యక్షుడు ట్రంప్‌తో నేను చర్చించాను. సరిహద్దుల భద్రతను బలోపేతం చేసేందుకు 1.3 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను అమలు చేస్తున్నాం. అమెరికా బలగాల సహకారంతో సరిహద్దుల్లో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడతాం. సిబ్బందిని పెంచడంతో పాటు కొత్త హెలికాప్టర్లను మోహరిస్తాం. ఫెంటనిల్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. సరిహద్దు రక్షణ కోసం 10,000 మంది బలగాలను నియమిస్తాం. ఫెంటనిల్‌ సరఫరాదారులను ఉగ్రవాదులుగా పరిగణించేందుకు చర్యలు చేపడతాం. అంతేకాదు, వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్‌, ఫెంటనిల్‌ వ్యాపారాన్ని అణచివేయడానికి కెనడా-యూఎస్‌ జాయింట్‌ స్ట్రయిక్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ అనుసరించే వరకూ ప్రతిపాదించిన టారిఫ్‌లను కనీసం 30 రోజుల పాటు నిలిపివేయడానికి అంగీకారం కుదిరింది'' అని ట్రూడో తన 'ఎక్స్‌' ఖాతాలో వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జస్టిన్ ట్రూడో చేసిన ట్వీట్ 

వివరాలు 

మెక్సికో, కెనడా, చైనాపై ట్రంప్‌ కఠిన చర్యలు 

ట్రంప్‌ తాజా నిర్ణయంతో, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై కెనడా విధించిన 25% సుంకం కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మెక్సికో,కెనడాతో పాటు చైనా పైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో సుంకాల కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మెక్సికో, కెనడాపై 25% టారిఫ్‌లు,చైనాపై 10% సుంకాలను విధించారు. ఈ క్రమంలో,మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ ట్రంప్‌తో ఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు. సరిహద్దు భద్రత కోసం సైన్యాన్ని మోహరిస్తామని హామీ ఇవ్వడంతో, ట్రంప్‌ తాత్కాలికంగా టారిఫ్‌ల అమలును నిలిపివేయడానికి అంగీకరించారు. అనంతరం ట్రూడోతో జరిగిన ఫోన్‌ సంభాషణ తర్వాత కెనడాకు కూడా ఈ విధంగా ఉపశమనం కల్పించారు. అయితే, చైనాపై విధించిన సుంకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తోంది.