Page Loader
China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..
యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని డ్రాగన్‌ దేశమైన చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడేందుకు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లివిట్‌ అధికారికంగా వెల్లడించారు. చైనా విధించిన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు, కీలకమైన ఖనిజాల విషయంలో నెలకొన్న వివాదాలు వంటి వాణిజ్య సంబంధిత సమస్యల పరిష్కారానికి ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు అని లివిట్‌ తెలిపారు. అయితే ఈ సంభాషణ ఎప్పుడు జరగనుందనే దానిపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ కూడా ధ్రువీకరించారు.

వివరాలు 

స్విట్జర్లాండ్‌ వేదికగా రెండు రోజుల పాటు చర్చలు

ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా దిగుమతులపై సుంకాలను 145 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాలు విధించింది. ప్రపంచ ఆర్థిక రంగంలో అగ్రస్థానాల్లో ఉన్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో స్విట్జర్లాండ్‌ వేదికగా రెండు రోజుల పాటు చర్చలు నిర్వహించారు. ఈ చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని చైనా విస్మరిస్తోందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన స్పష్టం చేస్తూ, ''అతి మంచితనం వాణిజ్య ఒప్పందాల విషయంలో పనికిరాదు'' అంటూ వ్యాఖ్యానించారు.