LOADING...
Trump: భారత్‌కు పాకిస్థాన్‌ చమురు విక్రయం సాధ్యమే.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
భారత్‌కు పాకిస్థాన్‌ చమురు విక్రయం సాధ్యమే.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Trump: భారత్‌కు పాకిస్థాన్‌ చమురు విక్రయం సాధ్యమే.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌తో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదిర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంలో,భవిష్యత్తులో భారత్‌కు పాకిస్థాన్‌ చమురు విక్రయించే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అమెరికా భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తోందని ప్రకటించడంతో, ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ,అమెరికా-పాకిస్థాన్‌ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు చమురు నిల్వల పెంపుపై కలిసి పని చేయనున్నాయి. ఇందుకోసం ఒక మంచి చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామన్నారు. దీనివల్ల భారత్‌కు పాకిస్థాన్‌ చమురు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

వివరాలు 

అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ట్రంప్‌ మరోవైపు,పలు దేశాల నాయకులతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు నిర్వహించినట్లు తెలిపారు. యునైటెడ్‌ స్టేట్స్‌ను తాము తృప్తిపరచాలన్న లక్ష్యంతోనే దేశాలు ముందుకెళ్తున్నాయని అన్నారు. కొన్ని దేశాలు అమెరికా విధించిన సుంకాలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని,వీటన్నీ అమెరికా వాణిజ్య లోటును తగ్గించడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,ట్రంప్‌ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.అమెరికా నుంచి దిగుమతి చేసే వస్తువులపై భారత్‌ అధిక సుంకాలను విధిస్తోందని ఆరోపించారు. భారత్‌ మిత్రదేశమే అయినప్పటికీ, 25శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు.అంతేకాకుండా, ఈ సుంకాలకు అదనంగా పెనాల్టీలు కూడా వర్తిస్తాయని హెచ్చరించారు.

వివరాలు 

రష్యాతో వాణిజ్యం కారణంగా 25% సుంకాలతోపాటు పెనాల్టీ

భారత్‌ రష్యా నుంచి భారీగా సైనిక సామాగ్రి, చమురు కొనుగోలు చేస్తున్న విషయంపై కూడా ట్రంప్‌ విమర్శించారు. రష్యాతో భారత్‌ వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నందుకు ట్రంప్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్లే 25 శాతం సుంకాలు, పెనాల్టీలు విధిస్తున్నామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటించిన ఈ విధమైన ఆంక్షల ప్రభావాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సూచించింది.