Page Loader
Trump-China: సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ షాక్‌ 
సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ షాక్‌

Trump-China: సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీ షాక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చైనాకు భారీ ఆర్థిక షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై 10% సుంకాలు విధించగా, ఇప్పుడు వాటిని 20%కి పెంచారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు. ఫెంటనిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్‌ విఫలమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. అందుకే, చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.

వివరాలు 

కెనడా, మెక్సికోకు లభించని ఊరట.. 

ఇక మరోవైపు,కెనడా (Canada), మెక్సికో (Mexico)దిగుమతులపై 25% సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఇవి యథావిధిగా అమల్లోకి వస్తాయని తెలిపారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్ర దేశాలైన మెక్సికో,కెనడా, అలాగే చైనా పైనా సుంకాల (Tariffs)విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తాయని గతంలోనే ప్రకటించారు.ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో ఫోన్‌లో చర్చలు జరిపారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్‌, ఫెంటనిల్‌ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వివరాలు 

కెనడా ప్రతీకార సుంకాలు 

దీనితో సుంకాల అమలును ఒక నెల పాటు వాయిదా వేసేందుకు ట్రంప్‌ అంగీకరించారు. అయితే, ఈ గడువు నేటితో ముగియడంతో మెక్సికో, కెనడాపై సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇకపై ఆ దేశాలకు ఎలాంటి మినహాయింపులు లభించవని అన్నారు. అయితే, చైనా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పటికే అమలులో ఉండగా, ఇప్పుడు వాటిని రెట్టింపు చేసినట్లు ట్రంప్‌ ప్రకటించారు. కెనడా నుంచి దిగుమతి చేసే పలు ఉత్పత్తులపై 25% సుంకం, అలాగే చమురు, సహజ వాయువు, విద్యుత్తుపై 10% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. దీనికి ప్రతిగా, కెనడా ప్రధాని ట్రూడో కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించారు.

వివరాలు 

మార్కెట్లపై ప్రభావం 

అమెరికా నుంచి దిగుమతి చేసే ఆల్కహాల్, పండ్లు, ఇతర వాణిజ్య ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 107 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ట్రేడింగ్‌లో మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. డోజోన్స్‌ 1.48%, ఎస్‌అండ్‌పీ సూచీ 1.76%, నాస్‌డాక్‌ 2.64% నష్టపోయాయి. ఈ ప్రభావం ఆసియా-పసిఫిక్‌, ఆస్ట్రేలియా మార్కెట్లపై కూడా పడింది. టోక్యో, హాంకాంగ్‌, సిడ్నీ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ 2.43% మేర క్షీణించింది.