Page Loader
Donald Trump: డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్‌ లేఖలు 
డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్‌ లేఖలు

Donald Trump: డెడ్‌లైన్‌కు ముందే కొత్త టారిఫ్‌లపై దేశాలకు ట్రంప్‌ లేఖలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల (టారిఫ్‌ల) అమలుకు నిర్ణయించిన జూలై 9 గడువు పొడిగించే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ గడువుకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను ఆయా దేశాలకు తెలియజేస్తూ లేఖలు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ట్రంప్ తెలిపారు. "అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత మొత్తం చెల్లించాలి అన్న విషయాన్ని వివరిస్తూ ఆయా దేశాలకు లేఖలు పంపించనున్నాం. రేపటి నుంచి రోజుకు దశలవారీగా 10 దేశాల చొప్పున ఈ లేఖలు పంపించే యోచనలో ఉన్నాం," అని ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

వివరాలు 

వాణిజ్య ఒప్పందాల కోసం 90 రోజుల గడువు

గతంలో ఆయన టారిఫ్‌లకు సంబంధించి నిర్ణయించిన గడువును పెంచవచ్చో, తగ్గించవచ్చో అనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిస్థితులను చూస్తే గడువు పొడిగింపు ఆశించటం కష్టం అనిపిస్తోంది. ఈ ప్రతీకార సుంకాలను ట్రంప్‌ అధ్యక్ష పదవిలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఏప్రిల్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనలో భారత్‌, చైనా వంటి అనేక దేశాలపై భారీ టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అయితే, తాత్కాలికంగా ఈ సుంకాల అమలును నిలిపివేసి, ఆయా దేశాలతో దిగుమతి, ఎగుమతులకు సంబంధించిన టారిఫ్‌లపై నిర్ణయానికి, వాణిజ్య ఒప్పందాల కోసం 90 రోజుల గడువు ఇచ్చారు. ఇది జూలై 9వ తేదీతో ముగియనుంది.

వివరాలు 

రెండు రోజుల్లో భారత్‌-అమెరికాల మధ్య చిన్న స్థాయి ట్రేడ్‌ డీల్‌

ఈ గడువు లోగా అమెరికాతో ట్రేడ్‌ డీల్‌ (వాణిజ్య ఒప్పందం) కుదరకపోతే, ఆయా దేశాలపై అమెరికా తన నిర్ణయ ప్రకారమే సుంకాలు విధించనున్నట్లు ట్రంప్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో భారత్‌, చైనా, బ్రిటన్‌ వంటి దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కొన్ని దేశాలు ఇప్పటికే ఒప్పందాల దశకు చేరగా, భారత్‌తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో భారత్‌-అమెరికాల మధ్య చిన్న స్థాయి ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఇక చైనాతో ఒప్పందం కుదిరిన విషయాన్ని ట్రంప్ ఇటీవలే ధృవీకరించారు.