
Donald Trump: అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ.. డీల్ ఉక్రెయిన్ చేతుల్లోనే!
ఈ వార్తాకథనం ఏంటి
అలాస్కా వేదికగా జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక భేటీ ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసింది. ఈ సమావేశంలో డీల్ పూర్తి అయ్యే నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందని ట్రంప్ వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడుతూ, ఇదే విషయాన్ని జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తాను. అయితే వారు అది నిరాకరించే అవకాశం కూడా ఉంది. రష్యా చాలా శక్తివంతమైన దేశం. పుతిన్-జెలెన్‌స్కీ భేటీ జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆ భేటీలో నేను కూడా చేరే అవకాశం ఉందని అన్నారు.
Details
కొన్ని షరతులను తప్పకుండా అంగీకరించాలి
పుతిన్‌తో ఏ విషయాలు చర్చించారో, ఇంకా ఏ అంశాలు మిగిలి ఉన్నాయో వివరించడానికి ట్రంప్ నిరాకరించారు. ఈ క్రమంలో, పుతిన్ ప్రస్తావించిన విషయం ఏమిటంటే, జెలెన్‌స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కానీ కొన్ని షరతులను తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పారు. క్రెమ్లిన్ ప్రకారం, సంతకాలు చేయడానికి శాంతి ఒప్పందం సిద్ధంగా ఉండే సమయంలో మాత్రమే భేటీ జరుగుతుంది. పుతిన్ ఈ సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని, ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నాడని తెలిపారు. వివాదానికి ముగింపు చెప్పే తొలి అడుగుగా ఈ భేటీని పుతిన్ అభివర్ణించారు. అంతేకాక పుతిన్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. చివరగా ట్రంప్‌తో తన సంబంధం వ్యాపారం లాంటి సంబంధమేనని పుతిన్ పేర్కొన్నారు.