Donald Trump: ట్రంప్ వలస విధానం.. భారతీయుల భవిష్యత్తుకు ముప్పా?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ విధానం ఆయనకు మరొకసారి అధ్యక్ష పదవి గెలుచుకోవడంలో సాయపడింది.
అయితే అక్రమ వలసదారులు, చట్టబద్ధంగా వచ్చిన వలసదారుల మధ్య తేడా లేకుండా ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
అమెరికా ఆర్థిక, సామాజిక, నైతిక క్షీణతకు వలసదారులే ప్రధాన కారణమంటూ ట్రంప్ ప్రచారం చేశారు.
అటువంటి అభిప్రాయాలు ఓటర్లలో ఎక్కువగా ఉండటంతో ఆయనకు మద్దతు పెరిగింది. నిజానికి, అమెరికా ఒక వలసదారుల దేశమే.
Details
మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా
కానీ మెక్సికో, కెనడా సరిహద్దుల ద్వారా అక్రమంగా ప్రవేశించే వలసదారులు కొకైన్, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
ఈ మత్తుమందుల వల్ల అమెరికన్లు బానిసలవుతున్నారని, నేరాలు, అవినీతి పెరిగిపోయాయని ఆయన వాదించారు. అయితే సమస్య అక్కడితో ఆగలేదు.
చట్టబద్ధంగా వలస వచ్చినవారిపైనా అమెరికా శ్వేతజాతి వ్యక్తుల అక్కసు పెరుగుతోంది.
ట్రంప్ తనకు కృత్రిమ మేధ సలహాదారుగా నియమించుకున్న భారతీయ అమెరికన్ శ్రీరాం కృష్ణన్ గ్రీన్ కార్డులపై చేసిన వ్యాఖ్యలతో రిపబ్లికన్ పార్టీలోని అతివాద వర్గం మండిపడింది.
అక్రమ, సక్రమ వలసదారుల మధ్య తేడా చెరిగిపోవడం అమెరికా సమాజంలో పెరుగుతున్న విభేదాలను సూచిస్తుంది.
Details
అక్రమ వలసలపై ట్రంప్ కఠిన చర్యలు
ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇతర దేశాల అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలిస్తున్నారు.
హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డుల విషయంలో నిపుణులను ప్రోత్సహించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నా, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రతిపాదనతో చట్టబద్ధంగా వచ్చిన వలసదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు.
మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా ప్రవేశించే లక్షల మందిలో కొంతమందికి అనుమతులు ఇచ్చే 'సీబీపీ వన్' యాప్‌ను ట్రంప్ రద్దు చేశారు.
అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి ఆయన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అవసరమైతే సైన్యాన్ని వినియోగించి అక్రమ వలసదారులను తరిమేస్తానని హెచ్చరించారు.
నాలుగేళ్లుగా ట్రంప్ లేకపోవడంతో అక్రమ వలసల సంఖ్య పెరిగిందని, మాదక ముఠాల ప్రభావం విపరీతంగా పెరిగిందని ఆయన వాదిస్తున్నారు.
Details
భారత్‌పై ప్రభావం
మెక్సికో, ఎల్ సాల్వడోర్, ఇండియా, వెనెజులా, కొలంబియా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో వలసదారులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు.
2024లో అమెరికా సరిహద్దును దాటిన వారిలో 3శాతం భారతీయులేనని గణాంకాలు వెల్లడించాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం 7.25 లక్షల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా ఉన్నారు.
వారిలో 18,000 మందిని తిరిగి స్వదేశానికి పంపేందుకు భారత్ అంగీకరించినట్లు వార్తలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు 104 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో వెనక్కి పంపించారు.
భారత ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో అమెరికా చర్యలను వ్యతిరేకించడం లేదు. కానీ సక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తోంది.
Details
సిలికాన్ వ్యాలీపై ప్రభావం
అమెరికాలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో వారు కీలక పాత్ర పోషించడం వల్ల ఈ సమస్యకు సమతుల్యత అవసరం.
సిలికాన్ వ్యాలీలో భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలను భారతీయ మూలాలున్న వ్యక్తులే నడిపిస్తున్నారు.
హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికాకు వెళ్లిన భారతీయులు భారీగా పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ట్రంప్ కొత్త వలస విధానాలు నిపుణ భారతీయులను కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Details
మోదీ-ట్రంప్ భేటీ.. పరిష్కారం దొరుకుతుందా?
అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కి పంపించడంతో వారి ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది.
అదనంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు తమ కుటుంబాలకు పంపే డాలర్ల ప్రవాహం తగ్గిపోతుంది. ఇది భారత విదేశీ మారకద్రవ్య నిల్వలపై ప్రభావం చూపనుంది.
ట్రంప్ వలస విధానాలు ఏ దేశానికీ మినహాయింపు ఇవ్వవు. అయితే ఆయన భారతీయులను తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించడం విశేషం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ట్రంప్, మోదీల మధ్య స్నేహభావం భారత్‌కు ప్రయోజనకరమవుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఈ సమస్యను రెండు దేశాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.