LOADING...
India-USA: పాక్‌తో వ్యాపార ఒప్పందాల కోసం.. ట్రంప్ భారత సంబంధాలను త్యాగం చేశారు:  జేక్ సుల్లివన్  
ట్రంప్ భారత సంబంధాలను త్యాగం చేశారు:  జేక్ సుల్లివన్

India-USA: పాక్‌తో వ్యాపార ఒప్పందాల కోసం.. ట్రంప్ భారత సంబంధాలను త్యాగం చేశారు:  జేక్ సుల్లివన్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ సుంకాల విధానం కారణంగా భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిసిందే. ఈ విషయంపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులేవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో తన కుటుంబ వ్యాపార ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో ఉన్న స్నేహాన్ని త్యజించారని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సులేవాన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించారు.

వివరాలు 

 ట్రంప్‌ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన సులేవాన్‌ 

సులేవాన్‌ మాట్లాడుతూ.."ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేసింది.సాంకేతిక రంగంలో భాగస్వామ్యం,చైనాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక సహకారం కోసం ఆ దేశంతో కలిసి పనిచేయడం అత్యంత కీలకం. ఈ దిశలో అమెరికా చాలా పురోగతి సాధించింది. కానీ, ఇప్పుడు ట్రంప్‌ కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం పాకిస్థాన్‌ ముందుకొచ్చింది. దీంతో ఆయన భారత్‌తో స్నేహాన్ని పక్కన పెట్టారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మన ప్రయోజనాలకు ఎంతో విలువైనవి. వాటిని కోల్పోవడం అమెరికాకు వ్యూహాత్మక పరంగా పెద్ద దెబ్బ" అని తెలిపారు. అదే సమయంలో ట్రంప్‌ వైఖరిని సులేవాన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే కొనసాగితే అమెరికా మిత్రదేశాలు కూడా దూరమవుతాయని హెచ్చరించారు.

వివరాలు 

పాకిస్థాన్‌పై కేవలం 19శాతం టారిఫ్‌లు

దీనివలన అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. భారత్‌తో ఉన్న సంబంధాల మార్పులు పరోక్షంగా,ప్రత్యక్షంగా ఇతర మిత్రదేశాలపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇటీవల అమెరికా-పాకిస్థాన్‌ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి.రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న కారణంతో భారత్‌పై 50శాతం భారీ సుంకాలు విధించిన అమెరికా,పాకిస్థాన్‌పై మాత్రం కేవలం 19శాతం టారిఫ్‌లు మాత్రమే విధించింది. మరోవైపు భారత్-పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత కాల్పుల విరమణ తన వల్లే సాధ్యమైందని ట్రంప్‌ తరచూ చెప్పుకుంటున్నాడు. దీనిని భారత్‌ ఎప్పటికప్పుడు ఖండించినా,ఇస్లామాబాద్‌ మాత్రం ఆయనను శాంతి దూతగా కొనియాడుతూ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేసింది. అదనంగా,ట్రంప్‌ కుటుంబం పాకిస్థాన్‌ సహకారంతో క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించడంతో, ఇస్లామాబాద్‌తో మరింత సన్నిహితంగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

దశాబ్దాల ప్రయత్నం విచ్ఛిన్నం.. 

ట్రంప్‌ సుంకాల విధానాన్నిమరో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ కూడా తీవ్రమైన విమర్శలకు గురి చేశారు. ఆయన ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. "రష్యాతో భారత్‌ సంబంధాలను తగ్గించేందుకు పశ్చిమాసియా దేశాలు ఎన్నో ఏళ్లుగా శ్రమించాయి. చైనా నుంచి వచ్చే వ్యూహాత్మక ప్రమాదాలపై పలుమార్లు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న వినాశకరమైన సుంకాల నిర్ణయం దశాబ్దాల కృషిని పాడు చేసింది.దీంతో ఆసియాలో చైనాకు రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు మరింత అవకాశం లభించింది"అని పేర్కొన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే,ట్రంప్‌ తొలి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్‌ బోల్టన్‌ జాతీయ భద్రతా సలహాదారిగా పనిచేశారు. అయితే ట్రంప్‌ వ్యవహరించే తీరు నచ్చకపోవడంతో విభేదాలు తలెత్తి, చివరకు బోల్టన్‌ తన పదవికి రాజీనామా చేశారు.