
Donald Trump: జపాన్ ఆటోలపై సుంకాలను 15%కి తగ్గిస్తూ ట్రంప్ సంతకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో జపాన్‌పై విధిస్తున్న సుంకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 శాతం సుంకాన్ని 15 శాతానికి తగ్గిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. జపాన్ తయారీ వాహనాలు సహా పలు ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఈ నిర్ణయం ద్వారా అమలులోకి రానుంది. గత జూలైలో అమెరికా-జపాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. దీని కోసం నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత రెండు దేశాలు తుది నిర్ణయానికి వచ్చాయి.
వివరాలు
జపాన్ కార్లపై ప్రస్తుత 27.5 శాతం సుంకాన్ని 15 శాతానికి తగ్గించనున్నారు
ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికా మార్కెట్లో జపాన్ సుమారు 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదేశాల ప్రకారం, జపాన్ కార్లపై ప్రస్తుత 27.5 శాతం సుంకాన్ని 15 శాతానికి తగ్గించనున్నారు. ఈ మార్పు ఈ నెలాఖరుకల్లా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం రోజున ట్రంప్ అమెరికా-జపాన్ కొత్త వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ చర్యతో రెండు దేశాల మధ్య "వాణిజ్య సంబంధాల కొత్త యుగానికి నాంది పలికినట్టే" అని ఆయన వ్యాఖ్యానించారు. జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం,అమెరికాలోకి దిగుమతయ్యే జపాన్ ఉత్పత్తులపై 15 శాతం ప్రాథమిక సుంకం విధించనున్నారు.
వివరాలు
అమెరికాలోకి వచ్చే దాదాపు అన్నిరకాల జపనీస్ దిగుమతులపై 15 శాతం ప్రాథమిక సుంకం
అయితే ఆటోమొబైల్స్, విడిభాగాలు, ఏరోస్పేస్ పరికరాలు, జనరిక్ ఔషధాలు, దేశీయంగా లభించని సహజ వనరుల వంటి కొన్ని విభాగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ప్రారంభ దశలో ట్రంప్ ప్రభుత్వం జపాన్‌తో పాటు దక్షిణ కొరియాపై కూడా 25 శాతం సుంకం విధించనుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా-జపాన్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు తిరిగి చర్చలు పునఃప్రారంభమై, తుది దశలో ట్రంప్ పరిపాలన జపాన్ దిగుమతులపై 15 శాతం బేస్‌లైన్ సుంకం విధించడానికి అంగీకరించింది. "ఈ ఒప్పందం ప్రకారం, అమెరికాలోకి వచ్చే దాదాపు అన్నిరకాల జపనీస్ దిగుమతులపై 15 శాతం ప్రాథమిక సుంకం అమలవుతుంది" అని వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
జపాన్‌కు ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల విలువ సంవత్సరానికి దాదాపు 8 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం
ఇక ఈ ఒప్పందం ప్రకారం, జపాన్ కూడా అమెరికాలో ఉత్పత్తి చేసిన బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య విమానాలు, రక్షణ సామాగ్రి, బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్స్, ఎరువులు, బయోఇథనాల్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేయడానికి అంగీకరించింది. అంతేకాకుండా, టోక్యో కనీస యాక్సెస్ ప్లాన్ కింద బియ్యం దిగుమతులను 75 శాతం పెంచాలని నిర్ణయించుకుంది. దీని ఫలితంగా, అమెరికా నుంచి జపాన్‌కు ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల విలువ సంవత్సరానికి దాదాపు 8 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.