
Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
అణ్వాయుధాల విషయాన్ని ఇరాన్ మర్చిపోవాలని, లేకపోతే తీవ్ర మిలిటరీ చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
అణు ఒప్పందం తుదిదశకు చేరుకున్నప్పటికీ, ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
పైగా, తాము మోసపోతున్నామన్న అనుమానం కూడా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్-అమెరికా మధ్య శనివారం ఒమన్‌లో అణు ఒప్పందంపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశంలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి కలిసి చర్చలు నిర్వహించారు.
ఈ చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ తమను ఒప్పించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
టెహ్రాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా సైనిక చర్య
ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండరాదన్న ఆలోచనను పూర్తిగా వదిలేయాలని హెచ్చరించారు.
ఒకవేళ అణు ఒప్పందానికి సిద్ధపడకపోతే, టెహ్రాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా సైనిక చర్య ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఒమన్‌లో జరిగిన చర్చల గురించి ఇరాన్, అమెరికా అధికారులు స్పందిస్తూ, ఇవి సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని పేర్కొన్నారు.
ఆ చర్చల రెండో విడత రోమ్‌లో శనివారం జరగనున్నట్లు వెల్లడించారు. రెండో దశ చర్చలకు ముందు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి రష్యా, చైనా దేశాలను సందర్శించి, మిత్ర దేశాల మద్దతును పొందేందుకు ప్రయత్నించనున్నారు.
వివరాలు
రెండు దేశాల మధ్య అణు ఒప్పందం
గతంలో, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్షంగా కొన్ని చర్చలు జరిగినా, అవి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
కానీ ఒబామా పాలనలో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.
2015లో జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది.
ఆ ఒప్పందాన్ని ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రద్దు చేశారు.
ప్రస్తుతం ట్రంప్ మరోసారి ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తోంది.