
Donald Trump: రష్యా చమురు కొంటున్న భారత్‌పై సెకండరీ సుంకాలే విధించా.. రెండు, మూడు విడతలను ఇంకా చేపట్టలేదు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే సెకండరీ సుంకాలు అమలు విధించానని, ఇంకా రెండు, మూడు విడతలను చేపట్టలేదని తెలిపారు. మరోవైపు, భారత్ విధిస్తున్న అధిక సుంకాలు అమెరికాను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఇంతకాలం అమెరికాపై సుంకాలు వేస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు వాటిని ఎత్తివేయడానికి ముందుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 'మనకు వ్యతిరేకంగా వారు సుంకాల రూపంలో దాడి చేశారు.చైనా, భారత్, బ్రెజిల్‌లు అమెరికాను కుదేలుచేస్తున్నాయి' అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పలువురు నేతలతో సమావేశమైన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
భారత్ నుంచి వస్తువులు వరదలా అమెరికాకు వచ్చాయి
భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశమని,అలాంటి దేశం ఇప్పుడు వాటిని తొలగించబోతున్నట్లు ప్రకటించడం గమనార్హమని పేర్కొన్నారు. అమెరికా నుంచి ఒత్తిడి రాకపోతే భారత్ ఎప్పటికీ ఈ నిర్ణయం తీసుకునేదిలేదని ఆయన అన్నారు. అలాగే,అమెరికా-భారత్ సంబంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ,అధిక సుంకాల కారణంగా అవి ఏకపక్షంగానే ఉన్నాయని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందని శ్వేతసౌధంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. "భారత్ అమెరికాపై విపరీతమైన సుంకాలు విధించింది.దీనివల్ల మన వ్యాపారానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ భారత్ మాత్రం మన మార్కెట్‌లో విస్తృతంగా వ్యాపారం చేసింది.అయినప్పటికీ, మనం వారిపై సుంకాలు విధించకుండా సహనం చూపించాం.భారత్ నుంచి వస్తువులు వరదలా అమెరికాకు వచ్చాయి"అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
అమెరికాకు వ్యతిరేకంగా ఆ ముగ్గురి కుట్ర
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌లపై కూడా ట్రంప్ ఘాటుగా విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు దేశాధినేతలు అమెరికాకు వ్యతిరేకంగా రహస్యంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం చైనా నిర్వహించిన ఆయుధ ప్రదర్శన నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో పోస్టు పెట్టారు. అందులో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా కోసం ప్రాణాలు అర్పించిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.