Trump's 'TACO' Moment: ఇరాన్ వార్‌లో ట్రంప్ యూ-టర్న్.. మళ్లీ ట్రంప్ 'టాకో'..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై భారీ దాడులు చేస్తామని గట్టిగా హెచ్చరించిన ట్రంప్.. అకస్మాత్తుగా ఐదు రోజుల విరామం ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్టైంది. కొన్ని రోజులుగా కుదేలైన స్టాక్ మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ మార్పుకు కారణం ట్రంప్ 'టాకో' మూమెంట్‌గానే నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
'టాకో' అంటే ఏమిటి?
ట్రంప్ నిర్ణయాలు తీసుకునే విధానంలో ఒక ప్రత్యేక ధోరణి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొదట కఠిన హెచ్చరికలు, ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించగానే వెనక్కి తగ్గడం ఆయన స్టైల్‌గా మారింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకంగా ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించే సమయంలో ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. మొదట భారీ సుంకాలు పెడతానని హెచ్చరిస్తారు.ఆ ప్రభావంతో మార్కెట్లు పడిపోతాయి. వెంటనే తన నిర్ణయాన్ని వాయిదా వేయడం లేదా వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధానాన్నే మార్కెట్ వర్గాలు'టాకో'గా పిలుస్తున్నాయి. దీని అర్థం 'Trump Always Chickens Out'.అంటే చివరి నిమిషంలో భయం లేదా ఒత్తిడి కారణంగా నిర్ణయం మార్చుకోవడం.
వివరాలు
ఇరాన్ యుద్ధం.. ప్రపంచంపై ప్రభావం
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. హర్మూజ్ జలసంధిలో అంతరాయం, ఇంధన కేంద్రాలపై దాడుల వల్ల చమురు ధరలు అమాంతం పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లు ఉన్న ముడి చమురు ధర 100 డాలర్లను దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. ఇంధన కొరత ఉంటుందనే ఆందోళనతో ప్రజలు ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పనివిధానాన్ని అమలు చేయగా, మరికొన్ని దేశాలు తమ వ్యూహాత్మక ఇంధన నిల్వలను వినియోగించుకోవడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ను 48గంటల్లో తెరవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేయగా..దానికి ప్రతిగా ఇరాన్ పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది.
వివరాలు
ఒక్కసారిగా బ్రేక్.. మార్కెట్లకు ఊపిరి
దీంతో యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాలు పెరిగాయి. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల్లో ట్రంప్ అకస్మాత్తుగా ఐదు రోజుల విరామం ప్రకటించడం గమనార్హం. ఇరాన్ ఇంధన మౌలిక వసతులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా సైన్యానికి ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అంతకుముందు తగ్గిన బంగారం,వెండి ధరలు మళ్లీ పెరుగుదల చూపించాయి. ట్రంప్ ఈ నిర్ణయాలు యాదృచ్ఛికం కావని, మార్కెట్ పరిస్థితులను బట్టి ముందుగానే ప్లాన్ చేసిన వ్యూహాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా స్పందించినప్పుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విశ్లేషిస్తున్నారు.
వివరాలు
'టాకో' పనిచేస్తుందా?
ట్రంప్ తాజా 'టాకో' మూమెంట్‌తో ప్రస్తుతం మార్కెట్లు కోలుకున్నప్పటికీ, యుద్ధ పరిస్థితుల్లో ఇదే వ్యూహం పనిచేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్‌ల విషయంలోలాగా యుద్ధం నుంచి బయటపడటం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, అలాంటి చర్చలేమీ లేవని ఇరాన్ ఖండించింది. మరోవైపు హర్మూజ్‌లో అంతరాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో చమురు, గ్యాస్ ధరలు వెంటనే తగ్గే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం కొనసాగితే ఈసారి 'టాకో ట్రేడ్' పనిచేయకపోవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల వెనుక ప్రభుత్వ వ్యూహాలే ప్రధాన కారణమా? లేక మార్కెట్ ఒత్తిడేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి.