Nijjar Killing: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులఅరెస్టుకు రంగం సిద్ధం
భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపిన ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను కెనడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రిక ప్రకారం, నిందితులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నారు. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు అనుమానిత హంతకులు కెనడాను విడిచిపెట్టలేదని,నెలల తరబడి కెనడా పోలీసుల నిఘాలో ఉన్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. రాబోయే కొన్ని వారాల్లోనే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 18న,రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(RCMP)కెనడాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారాలో కాల్పుల ఘటనను నివేదించింది.
భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం
భారత ప్రభుత్వం విడుదల చేసిన 40మంది టెర్రరిస్టుల జాబితాలో చేర్చబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ (45) గురుద్వారా పార్కింగ్ స్థలంలో కారులో బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. సెప్టెంబరులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఓ భారతీయుడిని తమకు అప్పగించాలని అగ్రరాజ్యం ఒత్తిడిచేస్తున్న ఈ సమయంలో నిజ్జర్ హత్య కేసులో అనుమానితులను అరెస్టు చేసేందుకు కెనడా పోలీసులు సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.