US-Syria: అల్-అస్సాద్ పతనం.. సిరియాలో అమెరికా వైమానిక దాడులు..వెల్లడించిన బైడెన్
సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు ముగింపు పలికారు. ఈ పరిణామాల కారణంగా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ సమయంలో సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం కీలక అంశంగా మారింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటించారు. తిరుగుబాటుదారులు సిరియాను తమ నియంత్రణలోకి తీసుకున్న సందర్భంలో బైడెన్ వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు.
13 ఏళ్ల పాటు సిరియా అంతర్యుద్ధంలో మగ్గింది
''బషర్ అసద్, ఆయన తండ్రి పాలనలో సిరియా దశాబ్దాలుగా తీవ్రమైన హింస, చిత్రహింసలు అనుభవించింది. గత 13 ఏళ్లలో అంతర్యుద్ధం కారణంగా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెబల్ దళాలు అసద్ పాలనను కూల్చి, ఆయన దేశం విడిచి పారిపోయేలా చేశాయి. ఈ పరిణామం సిరియాలో ప్రాథమిక న్యాయానికి దారితీసింది. ఇకపైనా సిరియా ప్రజలు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకునే చరిత్రాత్మక అవకాశాన్ని పొందారు'' అని బైడెన్ వ్యాఖ్యానించారు.
సిరియాలోని ఐసిస్ శిబిరాలు, కార్యవర్గాలపై వైమానిక దాడులు
అయితే, ప్రస్తుతం సిరియాలోని పరిస్థితులు అస్థిరతకు, ఉగ్రవాద ముప్పుకు కారణం కావచ్చని బైడెన్ పేర్కొన్నారు. అధికార మార్పు కారణంగా జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్ వంటి పొరుగు దేశాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా దేశాల నేతలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ గందరగోళ పరిస్థితులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠాలు తమ అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అలాంటిదానికి తాము అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే, సిరియాలోని ఐసిస్ శిబిరాలు, కార్యవర్గాలపై అమెరికా దళాలు డజనుకుపైగా వైమానిక దాడులు నిర్వహించాయని బైడెన్ వెల్లడించారు.