
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఆంక్షలు,ఇమ్రాన్ ఖాన్ విడుదలపై.. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను విడుదల చేయాలని అమెరికా కాంగ్రెస్‌లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు.
ఈ బిల్లులో ఇమ్రాన్‌ను రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. అంతేకాకుండా, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌పై ఆంక్షలు విధించాలని సూచించారు.
పాక్ డెమోక్రసీ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెట్టా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
గ్లోబల్ మ్యాగ్నిట్‌స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద దీనిని తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయ ఖైదీగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
వివరాలు
బిల్లులో ఏముంది?
అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, పాకిస్థాన్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేలా వారి వీసాలను రద్దు చేయాలని సూచించారు.
పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసి, ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ బిల్లు ప్రకారం, అమెరికా ప్రభుత్వం 180 రోజుల్లో పాకిస్థాన్‌లో రాజకీయ అణచివేతలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారికి జరిమానాలు, వీసా బ్యాన్లు విధించాలి.
అలాగే, అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుంది.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారని బిల్లులో పేర్కొన్నారు.
ఇస్లామాబాద్‌లో సైనిక పాలన పూర్తిగా ముగిసిన తరువాత మాత్రమే ఈ ఆంక్షలు తొలగించవచ్చు అని స్పష్టం చేశారు.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్‌పై కేసులు, అరెస్టు
ఇమ్రాన్ ఖాన్‌ను 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పించారు.
అనంతరం 2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన కేసులన్నీ సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరితమై మోపినవేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ఒక దశలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ నాయకత్వంలో ప్రజలు సైన్యంపై తిరగబడినా, దానిని కఠినంగా అణచివేశారు.
ఇమ్రాన్ మద్దతుదారులను జైళ్లలో వేయడం, నిరసనలను అణచివేయడం జరిగింది.
వివరాలు
అమెరికాలో మద్దతు
అమెరికాలోని డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఇమ్రాన్ ఖాన్ విడుదలకు మద్దతు ప్రకటిస్తున్నారు.
తాజాగా డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గం కూడా ఇమ్రాన్ ఖాన్ విడుదలలో జోక్యం చేసుకునే అవకాశముందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ట్రంప్ ప్రత్యేక మిషన్స్ దూత రిచర్డ్ గ్రినెల్ కూడా ఇమ్రాన్‌కు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు.