
Donald Trump: ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధం.. అమెరికా ఫెడరల్ కోర్టు.. తీర్పుపై తీవ్రంగా స్పందించిన ట్రంప్..
ఈ వార్తాకథనం ఏంటి
టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాలు (US Tariffs) చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు స్పష్టం చేసింది. అధ్యక్షుడిగా తన ఆర్థిక అధికారాలను ట్రంప్ అతిక్రమించి టారిఫ్‌లను అధికంగా పెంచారని కోర్టు వ్యాఖ్యానించింది. 7-4 ఓట్ల తేడాతో న్యాయమూర్తుల తీర్పు వెలువడింది. భారీగా పెంచిన సుంకాలు పలు దేశాల వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే అక్టోబర్ మధ్య వరకు అమల్లో ఉన్న టారిఫ్‌లను కొనసాగించేందుకు న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.
వివరాలు
వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని పక్షపాత అప్పీళ్ల కోర్టు తీర్పు : ట్రంప్
ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో స్పందిస్తూ, "ప్రస్తుతం అన్ని దేశాలపై విధించిన సుంకాలు కొనసాగుతున్నాయి. కానీ పక్షపాత అప్పీళ్ల కోర్టు వాణిజ్య భాగస్వాములపై విధించిన టారిఫ్‌లను తొలగించాలన్న తీర్పు చెప్పింది. చివరికి అమెరికా విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ టారిఫ్‌లు ఎత్తివేస్తే అది దేశ చరిత్రలోనే పెద్ద విపత్తు అవుతుంది. అమెరికా బలపడాలి కానీ ఈ నిర్ణయం మన ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును తగ్గించేందుకు, విదేశీ అడ్డంకులను ఎదుర్కొనేందుకు సుంకాలు ఇప్పటికీ సమర్థవంతమైన మార్గం. మిత్రదేశాలు గానీ శత్రుదేశాలు గానీ అనైతికంగా విధించే టారిఫ్‌లు, వాణిజ్య లోటు, అడ్డంకులను అమెరికా ఎప్పటికీ సహించదు.
వివరాలు
దేశాన్ని బలమైన, ధనికమైన, శక్తివంతమైన దేశంగా మారుస్తా: ట్రంప్
ఈ సుంకాలు ఎత్తివేస్తే దేశం నాశనమవుతుంది. అమెరికా ఉత్పత్తులు తయారు చేసే సంస్థలకు మద్దతు ఇవ్వడం అవసరం. మన కార్మికులకు ఇది ఒక్కటే సరైన సహాయం. ఎన్నేళ్లుగా రాజకీయ నాయకులు టారిఫ్‌లను మనకు వ్యతిరేకంగా వాడారు. కానీ నేను యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించి దేశాన్ని బలమైన, ధనికమైన, శక్తివంతమైన దేశంగా మారుస్తాను" అని పేర్కొన్నారు.
వివరాలు
అమలులోకి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలు చేశారు. దాంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా టారిఫ్‌లు విధించారు. మొదట బేస్‌లైన్‌గా 10 శాతం సుంకాలు విధించారు. భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు అమలు చేశారు. అయితే రష్యా నుంచి భారత్ చమురును తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభం పొందుతోందన్న కారణంతో వాటిని 50 శాతానికి పెంచారు. పెంచిన ఈ టారిఫ్‌లు ఈనెల 27 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.