
China: టారిఫ్‌లపై చర్చలు.. చైనాను సంప్రదించిన అమెరికా..!
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య సుంకాల అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది.
బీజింగ్‌కు చెందిన ఒక మీడియా సంస్థ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లుగా ఆ నివేదిక వివరించింది.
ఇప్పటికే ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఏప్రిల్‌లో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 145 శాతం సుంకాలు విధించింది.
దీనికి ప్రతిస్పందనగా చైనా ప్రభుత్వం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది.
ఈ పరిస్థితుల మధ్య, అమెరికా అధికారులు అనేక మార్గాల్లో చైనాతో సంప్రదింపులు కొనసాగించినట్లుగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ పేర్కొంది.
వివరాలు
చర్చలు జరిపేందుకు చైనానే ముందడుగు
చర్చలకు మొదట అమెరికానే ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ట్రంప్ ప్రభుత్వంపై గణనీయమైన ఒత్తిడి ఉన్నదని కూడా తెలిపింది.
అయితే, చైనా విదేశాంగ శాఖ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ఇక మరోవైపు, చర్చలు జరిపేందుకు చైనానే ముందడుగు వేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటిస్తున్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. "మా నిబంధనల మేరకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటాం. అదే సరైన మార్గం" అని న్యూస్‌నేషన్ టౌన్ హాల్ కార్యక్రమంలో వెల్లడించారు.
వివరాలు
భవిష్యత్తులో చర్చలకు సిద్ధం
దాదాపు వారం క్రితం కూడా ట్రంప్ ఇదే విధంగా వ్యాఖ్యానించగా, చైనా అధికారికంగా స్పందించి ఖండించింది.
అప్పట్లో బీజింగ్ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ, "ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు జరగడం లేదు. వాణిజ్య ఒప్పందం కూడా కుదరలేదు" అని స్పష్టం చేశారు.
అయినప్పటికీ, భవిష్యత్తులో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం ఆసక్తికరమైన అంశం.