Trump:కెనడా,మెక్సికో నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై విధించిన సుంకాలను.. నెల రోజుల పాటు నిలిపివేత : ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, తాజాగా ఈ నిర్ణయంపై ఆయన వెనక్కి తగ్గారు. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాల పెంపు అమలును ఒక నెల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కెనడా విధిస్తున్న సుంకాల గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కెనడా ఉత్పత్తులపై ఆధారపడకుండా, అమెరికా అడవుల్లో లభించే కలపను వినియోగించేందుకు తాను త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
వివరాలు
ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాల విధింపు అమలు
"కెనడా అధిక సుంకాలు విధిస్తోంది. మా పాల ఉత్పత్తులపై 250% సుంకాలను వసూలు చేస్తోంది. కలపపై కూడా అత్యధిక సుంకాలను విధిస్తోంది. అయితే, మేము కెనడా కలపపై ఆధారపడకుండా మా దేశపు అడవుల్లో లభించే కలపను వినియోగించేందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేయబోతున్నాను. మాకు ఉత్తమమైన కలప ఉంది,ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయంసమృద్ధిని సాధించగలము" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతేకాక, ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాల విధింపును అమలు చేస్తామని స్పష్టంగా తెలిపారు.
అదే విధంగా,మెక్సికో నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాల పెంపు నిర్ణయాన్ని కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
వివరాలు
జస్టిన్ ట్రూడో ప్రతీకార చర్యలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు మెక్సికో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందనే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కెనడా,మెక్సికోతో పాటు,చైనాపై ట్రంప్ విధించిన సుంకాలు ఈ దేశాలతో వాణిజ్య యుద్ధానికి దారితీశాయి.
దీనికి ప్రతిగా ఆయా దేశాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచాయి.
కెనడా అమెరికా నుంచి దిగుమతయ్యే 107బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 25% సుంకాన్ని విధించింది.
ఈ పరిస్థితుల్లో,కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తీసుకున్న ప్రతీకార చర్యల గురించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రూడో ఈ సుంకాల వివాదాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
అంతేకాక,కెనడాలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకునేందుకు తాను ప్రయత్నించినప్పటికీ, ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు.