Page Loader
Trump: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం 
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం

Trump: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తన జోక్యంతోనే తగ్గించగలిగానని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆ వ్యాఖ్యను తిరిగి మరోసారి పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమవుతున్న సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిఫ్‌ మునీర్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంలో ట్రంప్‌ ఆయన గౌరవార్థం ఓ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లోని కేబినెట్‌ రూమ్‌ ఈ సమావేశానికి వేదికగా మారింది. మూసివేసిన గదిలోనే ఈ ఇద్దరు నేతలు విందు చేసుకున్నారు. ఇరాన్‌కు భౌగోళికంగా సమీపంగా ఉన్న దేశం పాకిస్థాన్‌ కావడం ఒకవైపు, పాకిస్థాన్‌ సైనికాధిపతితో ట్రంప్‌ భేటీ జరగడం మరోవైపు అంతర్జాతీయంగా ఈ సమావేశానికి ప్రాధాన్యతను కల్పిస్తోంది.

వివరాలు 

మునీర్‌కు అధికారిక ఆహ్వానం.. కూటమిదౌత్య విజయంగా అభివర్ణిస్తున్న పాకిస్థాన్‌ వర్గాలు

ఒక దేశానికి చెందిన సైనికాధికారి‌కు అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో విందు ఇవ్వడం అంటే అది చాలా అరుదైన ఘటనగా పరిగణించవచ్చు. గతంలో అయూబ్ ఖాన్‌,జియా ఉల్ హక్‌,పర్వేజ్ ముషారఫ్‌ లాంటి వారు అమెరికా అధికారిక పర్యటనకు వెళ్లిన సందర్భాలు ఉన్నా,వారు అప్పట్లో పాకిస్థాన్‌ అధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మునీర్‌కు అధికారిక ఆహ్వానం అందడం పాకిస్థాన్‌ వర్గాలు తమ కూటమిదౌత్య విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో జీ7 సదస్సులో పాల్గొన్న ట్రంప్‌ సదస్సు మధ్యలోనే అమెరికాకు తిరిగివచ్చారు. తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మోదీని అమెరికాకు రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఈ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను:ట్రంప్  

అయితే, ముందస్తు షెడ్యూల్‌ కారణంగా ఇది సాధ్యం కాదని మోదీ స్పష్టంగా తెలియజేసినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇక మరోసారి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలపై స్పందించిన ట్రంప్‌... ఈ దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మళ్లీ పాతపాటే పాడారు. పాకిస్థాన్‌ తరఫున జనరల్‌ మునీర్‌, భారతదేశం తరఫున ప్రధాని మోదీ వంటి నేతలు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారన్నారు. ఈ విధంగా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య తాను మౌలికంగా శాంతి తీసుకురావడంలో కీలక పాత్ర వహించానని ప్రకటించుకోవడం గమనార్హం.