Page Loader
Air India: బోయింగ్ 787 రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు అవసరం లేదన్న అమెరికా  
బోయింగ్ 787 రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు అవసరం లేదన్న అమెరికా

Air India: బోయింగ్ 787 రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు అవసరం లేదన్న అమెరికా  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఘోర ప్రమాదానికి గురై 265 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ, బోయింగ్ 787 విమానాలను నిలిపివేయాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని వెల్లడించారు. అమెరికా రవాణా శాఖ కార్యదర్శి షాన్ డఫీ,ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తాత్కాలిక అధికారి క్రిస్ రోచెల్యూ నిన్న మీడియాతో మాట్లాడారు. వారు ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోల్ని పరిశీలించామని,కానీ బోయింగ్ 787 మోడల్లో భద్రతా లోపాలున్నాయనే విషయాన్ని నిర్ధారించగల ఆధారాలు తమ వద్ద లేవని తెలిపారు.

వివరాలు 

వీడియోల ఆధారంగా నిర్ధారణకు రాలేం: డఫీ 

"ఘటన స్థలాన్ని నిపుణులు పరిశీలించకుండా, కేవలం వీడియోల ఆధారంగా నిర్ధారణకు రాలేం. ఇది తగిన విధానం కాదు," అని డఫీ అన్నారు. ఈ దర్యాప్తులో భారత ప్రభుత్వంతో పాటు,బోయింగ్ సంస్థ,ఇంజన్లు తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ,ఎఫ్ఏఏ,అలాగే నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) బృందాలు పాల్గొంటున్నట్లు డఫీ తెలిపారు. ఇప్పటికే ఒక అమెరికన్ బృందం భారత్‌కు చేరుకుంటుందని,అవసరమైతే మరిన్ని నిపుణులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తూ,అవసరమైన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని రోచెల్యూ హామీ ఇచ్చారు. "ప్రయాణ భద్రతే మాకు అత్యంత ప్రాముఖ్యత.వాస్తవాల ఆధారంగా అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. భద్రతకు సంబంధించిన సూచనలొస్తే,వాటిని అమలు చేయడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయం," అని డఫీ ధృవీకరించారు.

వివరాలు 

అమెరికా అధ్యక్షుడి స్పందన 

ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ విషాద సమయంలో భారత్‌కు అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. "భారత్ ఒక శక్తిమంతమైన దేశం.వారు ఈ సంక్షోభాన్ని అధిగమించగలరు. మేము అవసరమైన ప్రతీ విధంగా సహకరిస్తామని భారత ప్రభుత్వానికి తెలియజేశాను"అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం బోయింగ్ 787 విమానాల సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.పూర్తి దర్యాప్తు పూర్తయ్యే వరకు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని,భారత్‌ ప్రభుత్వం ఈ దర్యాప్తును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ పూర్ణ సహకారం అందించనని అమెరికా అధికారులు మరోసారి వెల్లడించారు.