LOADING...
US ON INDIA, Pak: భారత్‌,పాక్‌ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు: అమెరికా
భారత్‌,పాక్‌ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు: అమెరికా

US ON INDIA, Pak: భారత్‌,పాక్‌ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు: అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, పాకిస్థాన్‌లతో తమ సంబంధాలు మునుపటిలాగే కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది. ఇరుదేశాలతో ఉన్న అనుబంధంలో ఎటువంటి మార్పు లేదని, దౌత్య పరంగా మంచి సహకారం కొనసాగుతోందని తెలిపింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడానికి అక్కడి దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల పాక్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌ భారత్‌తో సహా ప్రపంచంలోని సగానికి పైగా దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగించగలమని చేసిన హెచ్చరికల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

ఇరుదేశాల దౌత్యవేత్తలు బాధ్యతతో,నిబద్ధతతో పనిచేస్తున్నారు 

మంగళవారం జరిగిన ఒక సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ మాట్లాడుతూ.. ఇరుదేశాల దౌత్యవేత్తలు బాధ్యతతో,నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. భారత్‌, పాకిస్థాన్‌లతో అమెరికా కలసి పని చేయడం తమ దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ విధమైన సహకారం భవిష్యత్తులో సానుకూల ఫలితాలు తీసుకొస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. "మా సంబంధాలు ఇరుదేశాలతో మునుపటిలాగే కొనసాగుతున్నాయి. అందరితో ఆత్మీయంగా మాట్లాడగలిగే అధ్యక్షుడు ఉన్నందున దౌత్య పరంగా మాకు అదే ప్రధాన లాభం. ఇక్కడి దౌత్యవేత్తలు రెండు దేశాల పట్ల అంకితభావంతో ఉన్నారని స్పష్టమవుతోంది" అని బ్రూస్‌ చెప్పారు.

వివరాలు 

పాక్​, భారత్​ సంక్షోభాన్ని నివారించడంలో అమెరికా అగ్ర నాయకత్వం కూడా ప్రత్యక్షంగా పాలుపంచుకుంది

అనంతరం ట్రంప్‌-పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ భేటీ అనంతరం అమెరికా ఇస్లామాబాద్‌కు ఆయుధాల విక్రయ సహాయం పెంచుతుందా? అలాంటి చర్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ-ట్రంప్‌ సంబంధాలపై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు ఆమె స్పందించారు. "పాక్​, భారత్​ వివాదం జరిగినప్పుడు మాకు ఒక అనుభవం ఉంది, అది చాలా భయంకరమైనదిగా మారే అవకాశం ఉంది.ఆ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు,ఘర్షణలు ఆగేందుకు మేము చేసిన ప్రయత్నాల గురించి ఇప్పటికే వివరించాం. ఆ సంక్షోభాన్ని నివారించడంలో అమెరికా అగ్ర నాయకత్వం కూడా ప్రత్యక్షంగా పాలుపంచుకుంది" అని ఆమె చెప్పారు. అయితే, ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండానే ఇరు దేశాలు నేరుగా చర్చలు జరిపి సైనిక చర్యలను ఆపేశాయని భారత్‌ ఎన్నోసార్లు స్పష్టం చేసింది.

వివరాలు 

'భారత్‌ కొంచెం కఠినంగా వ్యవహరిస్తోంది' 

ఇక వాణిజ్య చర్చల విషయానికి వస్తే, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ మాట్లాడుతూ.. భారత్‌ కొంత వెనుకబడి ఉందని అన్నారు. స్విట్జర్లాండ్‌, భారత్‌ వంటి కొన్ని దేశాలతో పెద్ద వాణిజ్య ఒప్పందాలు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. అక్టోబర్‌ నాటికి సుంకాలపై జరుగుతున్న చర్చలు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్‌ ఈ విషయంలో కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.