UN: అమెరికా-ఇరాన్ యుద్ధ ఖర్చులతో 8.7 కోట్ల ప్రాణాలు కాపాడొచ్చు.. యూఎన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా .. ఇరాన్‌పై యుద్దానికి సంబంధించి ఖర్చు చేస్తున్న డబ్బుతో కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చని ఐక్యరాజ్య సమితి (UN) మానవతా విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధానికి రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు (దాదాపు £1.5 బిలియన్) ఖర్చవుతోందని ఆయన చెప్పారు. ఈ మొత్తాన్ని మానవతా సేవలకు వినియోగించి ఉంటే, 8.7 కోట్లకు పైగా ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
ఫ్లెచర్ హెచ్చరిక..
ఇరాన్‌పై హింసాత్మక వ్యాఖ్యలు చేయడం చాలా ప్రమాదకరమని ఫ్లెచర్ హెచ్చరించారు. ఇలాంటి మాటలు సాధారణమైపోతే, అందరూ బెదిరింపులు, దాడులు చేయడానికి ప్రోత్సాహం పొందుతారని చెప్పారు. దీంతో పౌరులు, వారి మౌలిక వసతులపై దాడులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లండన్‌లోని చాథమ్ హౌస్‌లో మాట్లాడుతూ.. గతంలో యుకే దౌత్యవేత్తగా, పలువురు ప్రధాన మంత్రులకు విదేశాంగ సలహాదారుగా పనిచేసిన ఫ్లెచర్, బ్రిటన్ రాజకీయ నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ దేశాన్ని "రక్షణాత్మక స్థితిలో"కి నెట్టేశారని అన్నారు.
వివరాలు
యుద్ధం వల్ల సంక్షోభం..
ఇటీవలి కాలంలో యుకే విదేశీ సహాయంపై భారీగా కోతలు విధించడం తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిలో, మానవతా సహాయం విషయంలో యుకే నాయకత్వం వహిస్తున్నామనే వారి వ్యాఖ్యలను అంతర్జాతీయ సమావేశాల్లో వినగానే కొందరు నవ్వుకుంటున్నారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య కొంచెం కఠినంగా అనిపించవచ్చని కూడా తరువాత అన్నారు. ప్రస్తుతం ఐక్య రాజ్యసమితి మానవతా వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్‌గా, ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఫ్లెచర్, భారీ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ సంక్షోభం "విపత్తు స్థాయి"లో ఉండి, బడ్జెట్‌లో సుమారు 50 శాతం కోత పడింది.
వివరాలు
ప్రజలను పేదరికంలోకి నెట్టే ప్రమాదం..
ఈ పరిస్థితికి అమెరికా మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా విదేశీ సహాయాన్ని తగ్గించడం కారణమని ఆయన చెప్పారు. ఇందుకు రాజకీయ భావజాలం, అలాగే రక్షణ ఖర్చులపై పెరుగుతున్న ఒత్తిడి ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని ఫ్లెచర్ పేర్కొన్నారు. ఆహారం, ఇంధన ధరలు దాదాపు 20 శాతం వరకు పెరగడంతో, ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిస్థితి మరింత మంది ప్రజలను పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉందని తెలిపారు.